ఆ ఊరికి నాలుగు పేర్లు

one village has four different names - Sakshi

ఏళ్లుగా కొనసాగుతున్న పేర్లు

అధికారుల తికమక

గ్రామస్తుల్లో తొణకని సఖ్యత

ఆదర్శంగా నిలుస్తున్న వైనం

ఆ ఊళ్లో కులాలు లేవు.. కుమ్ములాటలు లేవు. అందరూ ఒకటే. ఐకమత్యమే వారి బలం. అయినా విచిత్రమో విధి వైపరీత్యమో వారి ఊరికి మాత్రం నాలుగు పేర్లుంటాయి. దీంతో అందరిలో తికమక పుడుతుంది. అసలు ఏ పేరుతో పిలవాలనే విషయం ఇప్పటికీ తత్తరపాటే. ఒక్కో రికార్డుల్లో ఒక్కో పేరు ఉండడమే కారణం. అయినా వారిలో అంతరంగిక విషయాల్లో కూడా ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవు. 19 కుటుంబాలున్నా ఐకమత్యమే వారి ఆయుధం. ఆత్మవిశ్వాసమే వారికి ఆభరణం. ఒక్క కుటుంబమే ఒక్కటిగా లేని నేటి రోజుల్లో అందరూ కలిసి ఉండడమనేదే గొప్ప విషయం. నాగరికత వెర్రితలలు వేసే రోజుల్లో కూడా సంప్రదాయాలకు విలువిస్తూ చక్కని నడతను పాటిస్తూ.. వారి ఐక్యత ఇలాగే కొనసాగుతూ భావితరాలకు సైతం దిక్సూచిలా మారాలని ఆకాంక్షిస్తూ..
   

కెరమెరి :  సర్వ సాధారణంగా ఊరు ఒకటైతే.. పేరు ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఒకే గ్రామానికి నాలుగు పేర్లతో సంవత్సరాల కాలంగా విరాజిల్లుతోంది.  మండలంలోని దేవాపూర్‌ గ్రామ పంచాయతీలో ఉన్న ఓ గిరిజన పల్లె అది. 19 కుటుంబా లు, 87 మంది జనాభా ఉండే ఆగ్రామానికి నాలుగు పేర్లున్నాయి. చిత్తగూడ, గోండ్‌గూడ (డి), గొర్యగూడ, దేవాపూర్‌ గోండ్‌గూడగా పిలుస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో దీనికి చిత్తగూడ గా పేరున్నప్పటికీ, ఐటీడీఏ రికార్డుల్లో  గోండ్‌గూడ (డి) గా ఉంది. ఇక స్థానికులు మాత్రం ఈ పల్లెను గొర్యగూడ, దేవాపూర్‌ గోండ్‌గూడ నామంగా పిలుస్తున్నారు. 70 సంవత్సరాల చరిత్రగల ఈ ఆదివాసీ గ్రామానికి ఆది నుంచి ఎన్నోరకాల పేర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం పై నాలుగు పేర్లతో పిలవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. నూతన అధికారులెవరైన ఇక్కడికి రావాలంటే తికమక చెందుతున్నారు. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో పేరు చెబుతున్నారు.  ఐతే ఒకే జాతి (గోండ్‌) కి చెందిన వారుండడం. అందరూ ఒకరికొకరు దగ్గరి బంధువులు కావడం. నేటికీ ఏ గొడవలు లేకుండా కలిసికట్టుగా, ఐకమత్యంగా ఉండడం వీరి ప్రత్యేకత!

ఐకమత్యమే మా బలం..

19 కుటుంబాలున్నప్పటికీ  ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం. ఇదే మా ప్రత్యేకత. నేటి వరకు మా గ్రామంలో ఎప్పుడు గొడవలు కాలేదు. ఏ శుభ కార్యమైనా కలిసే చేసుకుంటాం. అందరూ ఒక్కటిగానే భావిస్తాం. ఎవరికి ఏ కష్టమొచ్చినా అందరం ఆదుకుంటాం.
కుమురం. బీర్‌శావు, గ్రామ పెద్ద 

అందరూ బంధువులే..

మా గ్రామంలో నివసించే వా రందరూ ఒకరికి ఒకరు బంధువులే. ఏదో ఓ కోణంలో చు ట్టాలవుతాం. అందుకు అంద రం ఒకే కుటుంబంలా కలిసి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకో వాలన్నా అందరం కలిసి ఒక్కటవుతాం. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.
కుమురం గోవింద్‌రావు
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top