ఏడాదిలో లక్ష ‘డబుల్ బెడ్రూమ్’లు | one lakh doublebedrooms in one year | Sakshi
Sakshi News home page

ఏడాదిలో లక్ష ‘డబుల్ బెడ్రూమ్’లు

Jun 10 2016 2:10 AM | Updated on Sep 29 2018 4:44 PM

ఏడాదిలో లక్ష ‘డబుల్ బెడ్రూమ్’లు - Sakshi

ఏడాదిలో లక్ష ‘డబుల్ బెడ్రూమ్’లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగం పంచుకునేందుకు రెండు విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి.

నిర్మాణానికి ముందుకొచ్చిన రెండు విదేశీ కంపెనీలు
పీపీపీ విధానంలో నిర్మిస్తామని సర్కారుకు ప్రతిపాదన
రెడీమేడ్ విడిభాగాలతో ఇళ్లు కడతామని వెల్లడి
పరిజ్ఞానంపై అధ్యయనానికి ప్రభుత్వ నిర్ణయం
13న సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న కంపెనీల ప్రతినిధులు 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగం పంచుకునేందుకు రెండు విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. కేవలం ఏడాది వ్యవధిలో రికార్థు స్థాయిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రతిపాదించాయి. విడి భాగాల (ప్యానల్స్) బిగింపుతో ఇళ్లు, బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మించడంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘ఎం2-ఎమ్మాడ్యు’ అనే ఇటలీ కంపెనీ...స్వీడెన్‌కు చెందిన ‘కోలో గ్లోబల్’తో కలసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఓ దఫా చర్చలు జరిపిన ఈ కంపెనీల ప్రతినిధి బృందం...ఈ నెల 13న రెండోసారి సమావేశం కానుంది.

ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో తొలుత సొంత నిధులతోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ఈ కంపెనీలు ఇప్పటికే అంగీకరించాయి. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా ఇళ్లు రాష్ట్రంలో కొత్త కావడంతో ఇక్కడి ప్రజలకు నచ్చుతాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. పైలట్ ప్రాజెక్టుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లేదా 50 ఇళ్లను నిర్మించాలని, ఈ ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపిస్తేనే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. సంప్రదాయ ఆర్‌సీసీ కాంక్రీట్ ఇళ్లతో పోల్చితే ఈ గృహాల మన్నిక కాలం ఎంత అనే అంశంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

రాష్ట్రం నుంచి స్థిరాస్థి వ్యాపారుల బృందాన్ని త్వరలో విదేశాలకు పంపించి 20 ఏళ్ల క్రితం ఎమ్మాడ్యు నిర్మించిన ఇళ్ల స్థితిగతులపై అధ్యయనం చేయించాలనే నిర్ణయానికి వచ్చింది. ఎం2-ఎమ్మాడ్యు కంపెనీ ఈ తరహా పరిజ్ఞానంతో ఇప్పటికే వెనిజులా, పనామా సహా పలు దేశాల్లో విజయవంతంగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించింది. ఈ భవనాలకు సంబంధించి సమాచారాన్ని కంపెనీ బృందం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించింది. రెడీమేడ్ ప్యానెల్స్‌తో 30 అంతస్తుల వరకు భవనాలను నిర్మించినట్లు అం దులో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలాభావం నెలకొని ఉండడంతో 13 అంతస్తులతో డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాలను నిర్మించి లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ‘గ్రేటర్’ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.6 లక్షలను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా..

అంతే వ్యయం లేదా అంతకన్నా తక్కువ వ్యయానికే తాము ఇళ్లను నిర్మించి ఇస్తామని ఈ 2కంపెనీలు ముందుకు రావడంతో ప్రభుత్వం సైతం ఆసక్తి కనబరుస్తోంది. ఈ తరహా ఇళ్లను ప్రజలు ఆమోదిస్తారని నిర్ణయానికి వస్తే ఈ కంపెనీలతో ఒప్పం దం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ మేర కు ప్రభుత్వం ఒప్పుకుంటే ఇళ్ల విడిభాగాల తయారీకి ‘ఎం2-ఎమ్మాడ్యు’ కంపెనీ స్థానికం గా ఓ కర్మాగారాన్ని నెలకొల్పనుంది. అక్కడ తయారైన విడిభాగాలను కాంక్రీట్ మిశ్రమం సాయంతో బిగించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ నెల 13న కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో పురోగతి లభించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement