బోనమెత్తిన పాతబస్తీ

Old city comes alive with Bonalu Festivities - Sakshi

భక్త జనంతో కిటకిటలాడిన దేవాలయాలు

తెల్లవారుజాము నుంచే బోనాల సమర్పణకు బారులు తీరిన భక్తులు

ప్రధాన దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

చార్మినార్‌/చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బోనమెత్తింది. భక్త జనంతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మ దర్శన భాగ్యం కోసం తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నేత, మాజీ ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. ఉదయం 7కి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది.

ఉదయం భక్తుల రద్దీ స్వల్పంగా ఉండటంతో బోనాల సమర్పణ వేగంగా సాగింది. పది గంటల అనంతరం భక్తుల తీవ్రత పెరగడంతో నెమ్మగించింది. అంతలోనే వీఐపీల రాక మొదలవడంతో బోనాల సమ ర్పణ మందగించింది. పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పాతబస్తీలోని ప్రధాన దేవాలయాల్లో అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు.  

పాతబస్తీలో భక్తుల కోలాహలం
పాతబస్తీలో ఏ వీధి చూసినా సందడిగా కనిపించింది. సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మహంకాళి దేవాలయం, సుల్తాన్‌షాహి జగదాంబ దేవాలయం, మేకల బండ నల్ల పోచమ్మ దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని భాగ్యనగర్‌ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు.

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. వర్షాలు విరివిగా కురవాలి. రైతన్నలు సుఖంగా ఉన్నప్పుడే దేశం సుఖంగా ఉంటుంది. పాడి, పంటలతో వారు వర్ధిల్లాలి.  
 – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌

రాష్ట్రంలో బోనాలే పెద్ద పండుగ
తెలంగాణ రాష్ట్రంలో బోనాలే అతి పెద్ద పండుగ. రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత బోనాల విశిష్టత మరింత పెరిగింది. ఢిల్లీ, విజయవాడతోపాటు అమెరికాలో కూడా నేడు తెలుగు ప్రజలు బోనాలు నిర్వహిస్తున్నారు. అందరూ బాగుండాలి. బంగారు తెలంగాణ సాధ్యం కావాలని అమ్మవారిని వేడుకున్నా. – ఇంద్రకరణ్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

మరిన్ని సదుపాయాలు కల్పించాలి
ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. అమ్మవారి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి. రైతులు పాడి, పంటలతో విరజిల్లాలి. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించినా.. ఆలయాల వద్ద మరిన్ని సదుపాయాలు కల్పించాలి. –కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  

అమ్మ దీవెనతోనే తెలంగాణ వచ్చింది
అమ్మవారి దీవెనతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ బిడ్డలకు మనోసంకల్పం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పినట్లుగా తెలంగాణ వచ్చేంత వరకే ఉద్యమాలు జరగాలి. వచ్చాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులేసుకుందాం.      – ప్రొఫెసర్‌ కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top