ఆదాయపత్రం నాలుగేళ్లు చెల్లుబాటు | Now, income certificate can be valid for Four years | Sakshi
Sakshi News home page

ఆదాయపత్రం నాలుగేళ్లు చెల్లుబాటు

May 26 2015 10:29 PM | Updated on Sep 3 2017 2:44 AM

వివిధ అవసరాల కోసం విద్యార్థులు, ఇతరులు ఇక నుంచి రెవెన్యూ అధికారుల నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రతియేటా తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

- తెల్లకార్డు ఉంటే ఆదాయధ్రువీకరణ పత్రం అక్కరలేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ అవసరాల కోసం విద్యార్థులు, ఇతరులు ఇక నుంచి రెవెన్యూ అధికారుల నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రతియేటా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక పర్యాయం తీసుకున్న పత్రాన్ని నాలుగేళ్లపాటు వినియోగించుకోవచ్చు. ఇక నుంచి తీసుకునే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లు చెల్లుబాటవుతుంది. ఈమేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తదితరాల కోసం తహసీల్దార్లు/ డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తీసుకునే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం ఏడాది పాటే చెల్లుబాటవుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఇలా ప్రతిదానికీ పత్రాలు తీసుకోవడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు తెల్లరేషన్ కార్డును సమర్పించినంతకాలం ఏ ప్రభుత్వ విభాగమూ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అడగరాదు. తెల్లరేషన్ కార్డును కలిగి ఉన్నారంటే దారిద్య్ర రేఖకు దిగువనున్నట్లు (బీపీఎల్)గా పరిగణించాల్సిందే. బీపీఎల్‌కు తెల్లరేషన్ కార్డే ఆధారం. ఇలాంటి వారు ప్రత్యేకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు.
- బీపీఎల్ కంటే ఎక్కువ ఆదాయ పరిమితి గల స్కాలర్‌షిప్పులు, ఇతర ప్రయోజనాల కోసం మాత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా మొదటిసారి మంజూరు కోసం మాత్రమే. రెన్యువల్స్‌కు అవసరంలేదు.
- ఏ విభాగం కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజనల్ తీసుకోరాదు. పరిశీలించిన తర్వాత ఒరిజనల్ పత్రాన్ని అభ్యర్థులకు వెనక్కు ఇచ్చేయాల్సిందే.
- ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల వారెవరూ ఉద్యోగాలిచ్చే సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదు. పంట రుణాలు, భూమిపై రుణాలకు బ్యాంకులు కూడా ఆదాయ పత్రాలు కోరరాదు.
ఈమేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి ఫార్మట్‌ను కూడా జీవోలో పొందుపరిచారు. తహసీల్దార్లు ఈ పత్రాల జారీ రిజిష్టర్లను పక్కాగా నిర్వహించాలని, తనిఖీల సమయంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టర్లు వీటిని పరిశీలించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement