ఆంగ్లంపై మోజుతో మాతృభాషపై నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఆంగ్లంపై మోజుతో మాతృభాషపై నిర్లక్ష్యం

Published Thu, Oct 3 2019 4:03 AM

Not Interested In Mother Tongue Says Venkaiah Naidu  - Sakshi

మాదాపూర్‌: ఆంగ్ల భాషపై మోజుతో మాతృభాషపై ఆసక్తి చూపడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పదవులను అధిరోహించేందుకు ఆంగ్లంపైనే మక్కువ చూపించడం సరికాదని, మాతృభాషలో పట్టుసాధిస్తే ఏ భాషలోనైనా రాణించవచ్చని హితవు పలికారు. మాదాపూర్‌ సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం విశ్వనాథ సాహిత్య పీఠం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పుస్తకాల అనువాదం ఎంతో కీలకమైందని, అనువదించేటప్పుడు భావం మారిపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది మహాత్ముల చరిత్రలను అన్ని భాషల్లోకి అనువాదించాలని, అప్పుడే ప్రపంచానికి వారి గొప్పతనం తెలుస్తుందని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’నవలలో గాంధేయవాదం ఉందన్నారు.

ఈ సమావేశం ముగింపు సందర్భంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువు, విద్య రెండు వేర్వేరు అంశాలని, పరీక్షలు, పట్టాల కోసం నేర్చుకునేది చదువని, జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు లోతుల వరకూ వెళ్లి విషయాలను అధ్యయనం చేయడం సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం విద్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.మృణాళినికి విశ్వనాథ అవార్డును ఉపరాష్ట్రపతి అందించారు. వైదేహీ శశిధర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం చైర్మన్‌ డాక్టర్‌ వెల్చాల కొండల్‌రావు, శాంతా బయోటెక్నిక్స్‌ సంస్థ హైదరాబాద్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డిలతో పాటు పలువురు సాహిత్యకారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement