ఆయకట్టుకు గడ్డుకాలం

No Water In Lakhanpur Project At Rangareddy - Sakshi

లఖ్నాపూర్‌ ప్రాజెక్టు వెలవెల

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

పరిగిపై వరుణుడి అలక

సాక్షి, పరిగి: జిల్లాలో రెండో అతిపెద్దదైన లఖ్నాపూర్‌ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. గత రెండేళ్ల వరకు ప్రాజెక్టు నీటితో కళకళలాడింది. ఈసారి పరిగి నియోజకవర్గంలో లోటు వర్షపాతంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ప్రాజెక్టులోకి ఆశించినస్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుతం ఒక అడుగు మేర మాత్రమే నీళ్లు  ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఖరీఫ్‌ సాగు ప్రారంభించకుండానే సీజన్‌కు ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీలోనైనా పంట వేద్దామనుకుంటే నీరు లేని దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినా నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ ఏడాది ఇక్కడ భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. పరిగి మండలంలోని లఖ్నాపూర్, మిట్టకోడూర్‌ గ్రామాలతో పాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్‌ తదితర ఎనిమిది గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తుంటారు.

బీళ్లుగా మారిన భూములు 
ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా ప్రాంతంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండగా ఇక్కడ భిన్నంగా ఉంది. గడిచిన వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా ప్రస్తుత వర్షాకాల సీజన్లో పరిగి ప్రాంతంలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. అగస్టులోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. 50 శాతానికి మించి వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తగా ప్రాజెక్టులోకి కనీసం ఒక ఫీటు నీరైనా చేరలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాకాలం ముగుస్తుండటం, ఇక భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా సన్నగిల్లడంతో రబీ సీజన్‌పైనా కర్షకులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రైతులకు తీవ్రనష్టం 
ఖరీఫ్‌లో వర్షాలు విరివిగా కురుస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. మామూలుగా కురిసిన వర్షాలు మెట్ట పంటలకే సరిపోయాయి చెరువుల్లోకి ఏమాత్రం నీరు వచ్చి చేరలేదు. దీంతో లఖ్నాపూర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కూడా వెలవెలబోయింది. సాగు చేయకుండానే ఖరీప్‌ సీజన్‌ ముగుతోంది. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతుల ఆశ నెరవేరేలా లేదు. భారీ తుఫాన్లు వస్తేగాని ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.

రూ. 12 కోట్ల నష్టం.. 
లఖ్నాపూర్‌ ప్రాజెక్టు ఆయకట్టులో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగు చేసే పరిస్థితి లేదు. దీంతో భూములు బీళ్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీజన్లలో కలిపి దాదాపు రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టులో వరి సాగు చేస్తే దాదాపు రూ. 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ధాన్యం పండుతుందని ఇక్కడి రైతులు అంటున్నారు. రెండు సీజన్లలో సుమారు రూ. 12 కోట్లకు పైగా నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top