పత్తాలేని అండర్‌–19 రాష్ట్ర పోటీలు... 

No Information Over Under-19 State Competitions In Joint Karimnagar District - Sakshi

ఎస్జీఎఫ్‌ రాష్ట్ర క్రీడల్లో తగ్గిన పోటీలు 

నిర్వహించేందుకు ముందుకు రాని కార్యదర్శులు 

సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది ఒక్క క్రీడాపోటీ నిర్వహించన వైనం  

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా క్రీడారంగం కుదేలైందా.. జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.. క్రీడలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించే పోటీలను చూస్తుంటే క్రీడారంగం దయనీయ పరిస్థితికి అద్దం పండుతోంది. మొన్ననే రాష్ట్ర పాఠశాలల, కళాశాలల క్రీడాసమాఖ్య తెలంగాణలోని 31 జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే క్రీడలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అండర్‌ – 14, 17 విభాగంలో కేవలం ఆరు అంశాల్లోనే పోటీలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక్క క్రీడాంశంలో కూడా రాష్ట్ర పోటీల నిర్వహాణ జరుగలేదు. ఇక అండర్‌–19 విభాగంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలకే దిక్కు లేకుండా పోవడం కొసమెరుపు.  

కరీంనగర్‌ జిల్లా క్రీడారంగం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పాఠశాలల, కళాశాలల క్రీడలతోపాటు వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు క్రీడల్లో విజయఢంకా మోగించి కరీంనగర్‌ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక క్రీడలో రాష్ట్ర, జాతీయ పోటీల నిర్వహణ పోటాపోటీగా జరుగడంతో క్రీడాహబ్‌గా కరీంనగర్‌ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నుంచి క్రీడల నిర్వహణ తగ్గుతోంది. గతేడాది సుమారు 10కిపైగా క్రీడల్లో రాష్ట్ర పోటీలు, ఒక క్రీడలో జాతీయస్థాయి పోటీలు జరిగాయి. ఈయేడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది.  

పత్తాలేని అండర్‌–19 రాష్ట్ర పోటీలు... 
స్కూల్‌ గేమ్స్‌ పరంగా చూస్తే అండర్‌ 14, 17 విభాగాల్లో సుమారు ఆరు క్రీడాంశాల్లో రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి జిల్లా అండర్‌–19 విభాగానికి వచ్చే సరికే పత్తా లేకుండా పోయింది. నాలుగు జిల్లాల్లో కనీసం ఒక్క క్రీడలో రాష్ట్ర పోటీలు నిర్వహించే బాధ్యతను ఆ సమాఖ్య కార్యదర్శి తీసుకోకపోవడం గమనార్హం. గతేడాది పలు క్రీడల్లో రాష్ట్ర పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన అండర్‌–19 కార్యదర్శి మధు జాన్సన్‌ ఈసారి ఒక్క క్రీడలో పోటీలు నిర్వహించలేదు.  

ముందుకు రాని కార్యదర్శులు... 
పాఠశాలల, కళాశాలల క్రీడల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కువ క్రీడల్లో పోటీలు నిర్వహించడానికి స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శులు ముందుకు రాలేదు. కరీంనగర్‌లో రెండు, జగిత్యాలలో రెండు, పెద్దపల్లిలో మూడు రాష్ట్రస్థాయి పోటీలు మాత్రమే జరుగనుండగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఒక్క అంశంలో కూడా క్రీడాపోటీలు నిర్వహించలేదు. స్కూల్‌ గేమ్స్‌పై కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం.. నిధులు మంజూరు కాక పోవడం.. సొంత ఖర్చులతో పోటీల నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో ఈఏడాది పోటీల నిర్వహణకు పలువురు కార్యదర్శులు ఆసక్తి చూపలేదని సమాచారం. 

సిరిసిల్ల జిల్లాలో నిల్‌.. 
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ యేడు పాఠశాలల, కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించలేదు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎస్జీఎఫ్‌ కార్యదర్శి విడుదల చేసిన అండర్‌ 14, 17, 19 మూడు విభాగాల జాబితాలో ఒక్క క్రీడలో కూడా ఈ ఏడాది పోటీలు నిర్వహించలేదు. మొత్తం 96 క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోటీల నిర్వహాణ మూడు కేటగిరీలలో పోటీలు జరుపాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లాలో ఒక్క కేటగిరిలో కూడా పోటీలు జరుగకపోవడం గమనార్హం.   

మూడేళ్లుగా విడుదల కాని నిధులు.. 
నిజానికి మూడేళ్ల నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహాణకు ఇచ్చే నిధులు విడుదలకాలేదు. దీంతో జిల్లాలో గతంలో పలువురు కార్యదర్శులు నిర్వహించిన పోటీల బడ్జెట్‌ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈసారి పోటీల నిర్వహాణకు దూరం ఉన్నారు. అండర్‌ 19 విభాగంలో గతంలో నిర్వహించిన పోటీలకు సుమారు రూ.20 లక్షలు, అండర్‌ 14, 17 విభాగంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు సుమారు రూ.42 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పోటీల నిర్వహణకు ఇటీవల కొత్తగా నియామకమైన పలువురు కార్యదర్శులు దూరంగా ఉన్నట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top