దాడులు సరే.. చర్యలేవి? 

No Action Plan By Department Of Drug Control On Operation Of Illicit Medical Stores In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అక్రమ మెడికల్‌ దుకాణాల నిర్వహణపై ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లావ్యాప్తంగా 1500 వరకు మెడికల్‌ షాపులు ఉండగా వీటికి ఆకస్మికంగా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు సంబంధిత శాఖ దాడులు చేస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో కేసుల నమోదు నామమాత్రంగానే ఉంది. నెలవారిగా ఆకస్మిక తనిఖీలను పరిశీలిస్తే చర్యలు తీసుకున్న ఘటనలు కేవలం నెలకు ఒకటి చొప్పున నమోదు అవుతున్నాయి. 

ఇదీ అక్కడ పరిస్థితి 
ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఔషధ నియంత్రణ శాఖ 447 ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 85 మెడికల్‌ షాపులను గుర్తించారు. ఇందులో 82 షాపులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం 24 మెడికల్‌ షాపులకు తాత్కాలికంగా సీజ్‌ చేశారు. కోర్టులో మాత్రం నమోదు అయిన కేసుల సంఖ్య మూడు మాత్రమే. మిగత కేసుల వివరాలను పరిశీలిస్తే వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ విషయంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్‌ నాయకుల జోక్యంతో కేసుల నమోదులో ఆలసత్వం చేస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ షాపులు అనేకం ఉన్నాయి. ఆర్‌ఎంపీ వైద్యులు అనుబంధంగా మెడికల్‌ షాపులను నిర్వహిస్తున్నరు. వీటిని కూడా అధికారులు చూసి, చూడనట్లుగా వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సరస్వతినగర్‌లో కొద్దిరోజుల కిందట ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి అనుమతి లేకుండా ఏర్పడింది. ఇందులో మెడికల్‌ను ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖకు సమాచారం అందించగా వారు చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఖలీల్‌వాడిలో గతంలో ఆకస్మికంగా దాడులు జరిపిన అధికారులు సుమారు 8 నెలలు అవుతున్న చర్యలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మెడికల్‌షాపులపై కన్నెత్తి చూడడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top