శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తవద్దు

Nizamabad Irrigation Depatment Says Not To Lift The Gates Of Sriram Sagar Project - Sakshi

వరదోస్తోంది..కాస్త ఆగుదాం..!

వరద గేట్లు ఇప్పుడే ఎత్తవద్దని నిర్ణయం

కొనసాగుతున్న మూడో పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు 

నిండుకుండను తలపిస్తున్న కాలువ

సాక్షి, నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లను తాకిన కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి వదలాలనే నిర్ణయాన్ని నీటి పారుదలశాఖ ప్రస్తుతానికి కొద్ది రోజులు వాయిదా వేసుకుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనుల్లో భాగంగా మొదటి, రెండు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికాగా, ఇటీవలే వెట్‌రన్‌ నిర్వహించిన విషయం విదితమే. దీంతో జలాలు ప్రాజెక్టు చెంతకు చేరగా, మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వరదకాలువ గేట్లు మాత్రం ఎత్తలేదు. దీంతో కాలువలోనే నీళ్లు ఉండిపోయాయి.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద జలాల రాక కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మూడో పంప్‌హౌస్‌ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి మంగళవారం పది వేల క్యూసెక్కులు వచ్చి చేరగా, బుధవారం రెండున్నర వేలు వచ్చింది. ఇలా ఏటా సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వరద రాక కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 31.849 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం 1,071.40 అడుగులు ఉంది. వరద గేట్లు 1,070 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంలో వరద గేట్లు ఎత్తితే 
ప్రాజెక్టులోని నీళ్లు వరద కాలువలోకి వచ్చి.. తిరిగి ప్రాజెక్టులోకి వెళతాయి. ఈ నేపథ్యంలో వరద గేట్లు ఎత్తాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.  

మూడో పంప్‌హౌస్‌ 
జిల్లాలోని ముప్కాల్‌ మండల కేంద్ర సమీపంలోని వరద కాలువ 0.1.కి.మీ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌస్‌ నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులు పూర్తవడానికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశాలున్నాయి. పనులు పూర్తయితే వరద కాలువ గేట్లు మూసివేసి నీటిని ప్రాజెక్టులోకి పంప్‌ చేయవచ్చు. కానీ ఈ పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి నీటిని ప్రాజెక్టులోకి పంపు చేయడానికి వీలుపడటం లేదు.  

నిండుకుండలా వరద కాలువ.. 
ప్రస్తుతం వరద కాలువ నిండు కుండలా మారుతోంది. కాళేశ్వరం జలాలు కాలువలోకి రావడంతో కాలువకు ఇరువైపులా భూగర్భ జలాలు మరింత వృద్ది చెందనున్నాయి. చుట్టుపక్కల వట్టి పోయిన బోర్లు రీచార్జ్‌ అవుతాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top