ఇంజన్‌ నుంచే కరెంట్‌..! | Sakshi
Sakshi News home page

ఇంజన్‌ నుంచే కరెంట్‌..!

Published Thu, Aug 8 2019 3:07 AM

New approach to power supply for train bogies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో బోగీలకు విద్యుత్‌ సరఫరా కోసం కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కొన్నేళ్లుగా యత్నిస్తోంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రతి రైలుకు రెండు పవర్‌కార్లను వినియోగిస్తున్నారు. డీజిల్‌తో ఇందులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి బోగీలకు సరఫరా చేస్తుంటారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో పాటు శబ్ద, వాయు కాలుష్యాలకు కారణమవుతోంది. దీంతో పవర్‌కార్లు లేకుండా నేరుగా ఇంజన్‌ నుంచే విద్యుత్‌ను సరఫరా చేసే ‘హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ (హెచ్‌ఓజీ)’పేరుతో కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది. తొలుత హైదరాబాద్‌–ఢిల్లీ మధ్య తిరిగే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం నుంచి ప్రారంభించారు. 

ఏంటా విధానం.. 
విద్యుత్‌తో నడిచే రైళ్లకు ఈ విధానం అందుబాటులో ఉంటుంది. విద్యుత్‌ వైర్ల నుంచి రైలుకు 25 కేవీ విద్యుత్‌ తీసుకుంటారు. వైర్ల నుంచి యాంటీనా వంటి ఉపకరణం విద్యుత్‌ను ఇంజన్‌కు అందిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరో ఉపకరణాన్ని ఇంజన్‌ వద్ద అమరుస్తారు. అది 25 కేవీ విద్యుత్‌ను 110 వోల్టులకు మార్చి ఇంజన్‌కు అవసరమైన దాన్ని ఇంజన్‌కు సరఫరా చేసి మిగతా దాన్ని బోగీలకు మళ్లిస్తుంది. ఆ విద్యుత్‌తో బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ పనిచేస్తాయి.  

Advertisement
Advertisement