నైజామోన్ని తరిమిన గడ్డ..!

Nalgonda Leaders In Telangana Movement September 17th - Sakshi

సాయుధ పోరాట చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది ప్రముఖపాత్ర 

ఆంధ్రమహాసభ  – కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరాటం

నల్లగొండ నుంచే రాష్ట్రమంతా రాజుకున్న ఉద్యమం  ∙పాటే చైతన్యంగా కదిలిన గ్రామాలు

 పోరాటంలో నేలకొరిగిన వందలాది మంది యోధులు...

ఇండియన్‌ యూనియన్‌లో తెలంగాణ విలీనమై నేటికి 73 సంవత్సరాలు

సొంతిల్లు.. సొంతూరు.. అయినా అనుక్షణం భయం.. భయం. అయినవాళ్ల మధ్యనే ఉన్నా.. ఉలికిపాటు.. గుర్రపు డెక్కల చప్పుడు వింటే గుండె దడ. రజకార్ల పొలికేక విన్పిస్తే మృత్యువు ముంచుకొచ్చినట్లే. జీవితమే రణరంగంలా మారిన తరుణంలో ఆంధ్ర మహాసభ – కమ్యూనిస్టు పార్టీ నేతృత్యంలో అయ్యా నీ భాంచన్‌ దొర కాల్మొక్తాన్న చేతులు బంధూకులు పట్టాయి. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసే అందిందల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఆయుధాలుగా మారాయి.   నైజాం రాజులను తరిమికొట్టడానికి ప్రత్యేక ఉద్యమ బలగాలు తయారయ్యాయి. నిజాం రాజులకు ఎదురుతిరిగి ముచ్చేమటలు పట్టించాయి. మహోన్నత చరిత్ర కలిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది విశిష్ట స్థానం. ఇక్కడ రాజుకున్న నిప్పు.. తెలంగాణ అంతా పాకింది. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశాడు. 

సాయుధ పోరాటంలో.. వీర వనితలు


తుపాకీ శిక్షణలో మొదటగా ఉన్న మహిళ మల్లు స్వరాజ్యం, చివరగా లలితాదేవి (ఫైల్‌)  

సూర్యాపేట : దేశచరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొని తుపాకీలు చేతపట్టి భూ మి, భూక్తి, విముక్తి కోసం పోరాడారు. అలాంటి వారిలో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితురాలు, సూర్యాపేట ప్రాంతా నికి చెందిన మల్లు స్వరాజ్యం ఒకరు కాగా.. చకిలం లలి తాదేవి మరొకరు. ఇందులో మల్లు స్వరాజ్యం మనముందే ఉండగా చకిలం లలితాదేవి ఇటీవల కన్నుమూశారు. 


లలితాదేవి (ఫైల్‌),  మల్లు స్వరాజ్యం 

భీంరెడ్డి అడుగుజాడల్లో..
తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మల కూతురు స్వరాజ్యం. సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వయానా సోదరి. భీంరెడ్డి అడుగు జాడల్లోనే సాయుధ పోరాటంలో బందూకు చేతబట్టి ముందుకు సాగింది. ఆమె సోదరీమణులు శశిరేఖమ్మ, సరస్వతమ్మతో కలిసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పోరాటంలో అనేక కష్టానష్టాలను ఎదుర్కొన్నారు. పోరాట విరమణ అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొన్న మామిళ్లమడవ గ్రామానికి చెందిన మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహమాడి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1978, 1983లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా అనేక ఏళ్ల పాటు పనిచేశారు. నేటికీ అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

ఏడాది నిండని బిడ్డతో పోరాటంలో పాల్గొన్న లలితాదేవి..
సూర్యాపేట తాలూకా కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారామారావు, వెంకటరామనర్సమ్మ కూతురు లలితాదేవి. లలితాదేవికి 14 ఏళ్ల వయస్సులో మోతె మండలం నామావరం గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడైన చకిలం తిర్మల్‌రావుతో వివాహం జరిగింది. 1946లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకీపట్టి సంవత్సరం కూడా నిండని కూతురుతో సహా ఉద్యమంలో పాల్గొంది. తుపాకులు పేల్చ డంలో శిక్షణ తీసుకుని మల్లు స్వరాజ్యం, ప్రియంవద, శశిరేఖలతో అడవులకు వెళ్లారు. లలితాదేవి, తిర్ముల్‌రావు ఆచూకీ తెలుకునేందుకు నామవరం గ్రామంలో వారి ఇంటిపై దాడులు చేసి అత్తమామలను చిత్రహింసలకు గురి చేశారు.  తొలి ఆంధ్రమహాసభలో పాలుపంచుకున్నారు. అజ్ఞాతంలో ఉండగా ఖమ్మంలో అరెస్టు చేయబడ్డారు. వరంగల్‌కు, ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లలో 3 సంవత్సరాల కూతురుతో గడిపారు. జైలు జీవితం తర్వాత పెరోల్‌పై విడుదల చేశారు. బయటికి వచ్చే సరికి భూమి, ఇలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. 

వీరులెందరో..
నాగార్జునసాగర్‌ : నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజకార్లతో పోరాడి అమరులైన వారు ఎందరో ఉన్నారు. అదేకోవకు చెందినవారు వడ్లపల్లి వీరారెడ్డి అలియాస్‌ వీరన్న వడ్లపల్లి రామచంద్రారెడ్డి అలియాస్‌ రామన్న. పోతునూరు శివారు ఏనెమీదిగూడెం (ఇప్పుడు పెద్దవూర మండలం) గ్రామానికి చెందిన నర్సమ్మ, మదార్‌రెడ్డి మూడో సంతానం వీరారెడ్డి 20–22సంవత్సరాల వయస్సులో ఎర్రజెండా నీడకు ఆకర్షితుడయ్యాడు. నంబాపురం అడవుల్లో గెరిళ్లా దళాలులకు భోజన అందిచేవాడు. ఈ విషయాన్ని మేడారం కరణం పసిగట్టాడు. ఈ ఘటనతో వడ్లపల్లి వీరారెడ్డి, వడ్లపల్లి రామచంద్రారెడ్డిని చెట్టుకు కట్టేసి  కాల్చి చంపారు. ప్రతీకారంగా కొద్దిరోజులకే మేడారం కరణాన్ని దళాలు పట్టుకుని నరికి చంపాయి.

ఈ ప్రాంతంలో వీరులు..
అల్వాల నరసింహారెడ్డి అల్వాల గ్రామస్తుడు ప్రస్తుతం తిరుమలగిరి(సాగర్‌) మండలంలో ఉంది. ఈయన జోనల్‌ కమాండర్‌ సాయుధ చర్య సందర్భంగా జనవరి 1949 తెప్పలమడుగులో మృతిచెందాడు. బీసం మట్టపల్లి వెంకటాద్రిపాలెం దళసభ్యుడు 1949లో చంపివేయబడ్డాడు. వెంకటయ్య నందికొండ. 1950 ఏప్రిల్‌లో నెల్లికల్లు (తిరుఏమలగిరి(సాగర్‌) మండలం)వద్ద కాల్చి చంపారు. సైదులు కుక్కడం దళసభ్యుడు 1950లో గ్రామంలో ఉండగానే కాల్చి చంపారు. నంబాపురం,  కొత్తపల్లిలో మరో ఇద్దరి కాల్చి చంపారు. ఈవిధంగా ఎంతో ఆనాటి బలగాల చేతిలో అమరులయ్యారు. 


వడ్డెపల్లి వీరారెడ్డి

ఉధృతమైన పోరాటం..
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లాది ప్రముఖ స్థానం. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గ్రామగ్రామానికి ఆంధ్ర మహాసభ విస్తరించింది. అప్పటికే ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభలో కీలక పాత్రదారిగా మారింది. నిజాం తాబేదార్లుగా జాగీర్దార్లు, జమిందార్లు, దొరలు, దేశ్‌ముఖులు, భూస్వాములు విచ్చలవిడి దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నించే, ఎదురించే శక్తిలేని ప్రజలు కష్టాలను భరిస్తూ, వెట్టిచాకిరి చేస్తూ కన్నీళ్లు మింగుతున్న తరుణంలో ఆంధ్ర మహాసభ రూపంలో కమ్యూనిస్టుపార్టీ ప్రజలను సమాయత్తపర్చింది. గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి.


కాచారంలో అమరవీరుల స్థూపాలు 

సంఘ సభ్యులపై నిజాంతొత్తులు దాడులకు గుండాలను ప్రయోగించాయి. అక్రమ కేసులు బనాయించి జైళ్ల కు పంపారు. ఇక దెబ్బకు దెబ్బ తప్పదని ఆంద్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయిం చాయి. ఈ నేపథ్యంలోనే 1947 సెప్టెంబర్‌ 11వ తేదీన ఆంధ్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్ధుం మోహినోద్దిన్‌ సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెలంగాణ ప్రజలు సమరశంఖం పూరించారు. రజాకార్లను, నిజాం బలగాలను ఎదుర్కొనడానికి సంసిద్దులైనారు. 10వేల మంది గేరిల్లా దళ సభ్యులుగా, లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు. తెలంగా ణాలోని దొరలు– భూస్వాములు, ప్రభుత్వ ఏజెంట్లు తప్ప, తెలంగాణా ప్రజలంతా ఒక్కటిగా కదిలారు. ప్రాణాలకు తెగించారు. లక్ష్యసాధనకు నడుంబిగించారు. ఊరూరా ఒక విప్లవ కేంద్రమయింది. ప్రతి వ్యక్తీ ఒక సైనికుడయ్యాడు. తెలంగాణ ఎరుపెక్కింది. ఆ సమయంలో పది లక్షల ఎకరాలు పేదలకు పంచిన కమ్యూనిస్టు పార్టీ వెయ్యి గ్రామాలకు పైగా పట్టుసాధించింది. భూస్వాములు, దొరలు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. 


గుండాల మండలం సుద్దాలలో సుద్దాల హనుమంత్‌ స్థూపం 

ఎంతో మంది యోధులు...
బాంచన్‌ దొరా.. నీ కాల్మొక్తా అన్న అమాయకులు బందూకులు చేతబట్టి నిజాం నవాబులను తరిమికొట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాలో ఆరుట్ల కమాలాదేవి, రాంచంద్రారెడ్డి, చింతలపురి రాంరెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పి.చెన్నారెడ్డి, జిట్ట రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి, సుశీల దేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి, కుర్రారం రాంరెడ్డి, గడ్డమీ రామ య్య, బద్దం నర్సింహారెడ్డిలతో పాటు మరెందరో వీరులు పోరాటానికి దన్నుగా నిలిచారు. చివరి దశలో సెప్టెంబర్‌ 11, 1948లో ఈ వీరుల పోరాటానికి తలొంచిన నైజాం నవాబులు 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణకు విముక్తి కలిగించారు. 

పాటే ప్రాణంగా పోరాటం..
భూమి, భుక్తి విముక్తి కోసం మట్టి మనుషుల పోరాటాన్ని ఎదుర్కోవడానికి ఆనాడు పాటే ఉపిరి పోసిందని పలువురు చెబుతున్నారు. అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడే పాట పుడుతుంది అన్న మాటలకు ఆనాటి సాయుధ పోరాట యోధులు నిదర్శనమయ్యారు. ప్రజలు పాటలను తమ బలంగా ఎంచుకుని ఉద్యమించారు. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన సుద్దాల హనుమంత్‌ రాసిన ‘బండేనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడకో.. నైజాం సర్కారోడా..’ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం రాజులపై తిరుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించిందని అప్పటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు చెబుతున్నారు. 

రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి
చిట్యాల (నకిరేకల్‌) : నిజాం నిరంకుశత్వ పాలన, రజాకార్ల కిరాతక చర్యలకు ఎదురొడ్డిన ఈ ప్రాంతం సాయుధ పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తుంది చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం. గుండ్రాంపల్లి గ్రామం నుంచి నాటి పోరాటంలో ఎందరో యువకులు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి అసువులు బాశారు. మరెందరో రజాకార్ల దమనకాండకు బలయ్యారు. ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటంలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం ద్వారానే తమ లక్ష్యాన్ని సాధించారు.

గుండ్రాంపల్లిలోని స్థూపం 

ఇత్తేహదుల్‌ ముసల్‌మాన్‌ సంస్థ ఏర్పాటుతో..
సాయుధ పోరాట సమయంలో సూర్యాపేట తాలుకాలోని వర్థమానకోటకు చెందిన సయ్యద్‌ మక్బూల్‌ అనే వ్వక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి తన కుటుంబసభ్యులతో వలస వచ్చాడు. ఆనంతరం బతుకుదెరువుకు గాను ఏపూరు గ్రామంలోని ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. ఆనంతరం ఆతను రజాకార్ల బృందంలో చేరాడు. ఇక ఆ తరువాత మక్బూల్‌ అరాచకాలకు ఈ ప్రాంతంలో అంతేలేకుండా పోయింది.  మక్బూల్‌ అరాచాకాలకు వ్వతిరేకంగా.. గుండ్రాంపల్లి కేంద్రంగానే నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు తమ పోరాటాన్ని కొనసాగించేవారు. ఈ పోరాటాంలో ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పాడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు.

దీనిని సహించని మక్బూల్‌ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి ఆతని  దాడిలో దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో బంధించాడు. వీరందరిని ఎడ్ల బండికి కట్టిపడేసి గుండ్రాంపల్లి నడిబోడ్డున గల (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ సంఘటనతో సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారు తమ పోరాటాలను ఉధృతం చేశారు. పలివేలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్‌పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళికను రూపొందించాయి. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్‌ తప్పించుకున్నాడు. దీంతో దళాల్లో పాల్గొన్న యువకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్‌ చేయి విరిగినప్పుటికీ ప్రాణాలతో తప్పింకుని పారిపోయాడు. కానీ అతని భార్య, కూతురు ప్రాణాలను కోల్పోయారు. అనంతరం మక్బూల్‌కు సహకరించిన వారి ఇండ్లపై దాడి చేసి వారిని చంపివేశారు. 

అమరవీరుల స్థూపం ఏర్పాటు..
నాటి పోరాటంలో 30 మందిని బావిలో పడేసిన చోట 1992 జూన్‌ 4వ తేదీని సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించి ఆవిష్కరించారు. ఇటీవల హైవే విస్తరణలో స్తూపాన్ని తొలగించగా.. మరోచోట నిర్మించారు.ఈ స్థూపం వద్దనే ఏటా నివాళులర్పించడం ఆనవాయితీ.

రావులపెంట కేంద్రంగా సాయుధ పోరాటం
మిర్యాలగూడ : నిజాం నవాబులను ఎదిరించడానికి వేములపల్లి మండలంలోని రావులపెంట కేంద్రంగా సాయుధ రైతాంగ పోరాటం సాగింది. రావులపెంటతో పాటు సమీప గ్రామాల ప్రజలంతా సాయుధ పోరాటంలో భాగస్వాములయ్యారు. నాడు నిజాం నవాబు తోపుచర్ల పిర్కాలోని గ్రామాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా జనం తిరగబడటంతో రావులపెంటలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వేములపల్లి మండలంలో ప్రధానంగా అమనగల్లు, పాములపాడు, రావులపెంటలో క్యాంపులు నిర్వహించడంతో పాటు రావులపెంటను కేంద్రంగా చేసుకొని నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. రావులపెంటలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చల్లా సీతారాంరెడ్డి నిజాం నవాబులను ఎదిరించేందుకు ఎన్నో క్యాంపులు నిర్వహించి వారి స్థావరాలపై దాడులు చేశారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపుల్లో ఎంతో మంది తలదాచుకున్నారు.


రావులపెంటలో ఆనాటి కోట బురుజు 

నిజాం పోలీసులు రావులపెంట, ఆగామోత్కూర్, తడకమళ్ల గ్రామాలలో చొరబడి ప్రజలపై దాడులు చేశారు. కానీ 1939లో ఉపాద్యాయుడిగా ఉద్యోగం పొందిన చల్లా సీతారాంరెడ్డి పాఠశాలల్లో ఉద్యమాలు బోధించడంతో పాటు 1946 కమ్యూనిస్టులతో ఉన్న సంబంధాల వల్ల ఉద్యోగాన్ని వదులుకొని సాయుధ పోరాటంలోకి వెళ్లారు. రావులపెంటల కేంద్రంగా చల్లా సీతారాంరెడ్డితో పాటు నారబోయిన నర్సయ్య, గట్టికొప్పుల రాంరెడ్డితో కలిసి మొదటి సారిగా రావులపెంటలో సభ నిర్వహించారు. అనంతరం ధరణికోట సుబ్బయ్య, గుంటి వెంకటనర్సయ్య, అవిరెండ్ల ఎల్లయ్య, జిన్నె పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, రామనర్సయ్య, దొంతిరెడ్డి వెంట్రామ్‌రెడ్డి, దొంతిరెడ్డి చెన్నారెడ్డి, పోలగోని గోపయ్య, అవిరెండ్ల రామచంద్రయ్యలతో కలిసి ఉద్యమ రూపకల్పన చేశారు. పాములపాడు, అమనగల్లు గ్రామాల్లో కూడా బహిరంగసభలు నిర్వహించారు. చల్లా సీతారాంరెడ్డిని పట్టకోవడానికి ఒకరోజు నిజాం పోలీసులు రావులపెంటలో మాటు వేశారు. కానీ ఆ గ్రామ ప్రజలంతా కలిసి నిజాంకు వ్యతిరేకంగా ఒక్కసారిగా వారి స్థావరంపై దాడి చేయడంతో పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.  

దళాలకు కొరియర్‌గా పనిచేశా
నల్లగొండ టౌన్‌ : నా 14ఏళ్ల వయస్సులో దళాలకు కొరియర్‌గా పనిచేశా. రాజాకార్లు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ పోరాటంలో ఈదులూరు అంజయ్య, పాదూరి జానపరెడ్డి దళాలకు కొరియర్‌గా పనిచేశా. ఆ సమయంలో నేను చిన్నవాడిని కావడంతో పాటు మానాన్నగారు సీతారామయ్య పేరొందిన బ్రాహ్మణుడు కావడంతో నాపై ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. సీతారామయ్య కొడుకుగా ఎలాంటి అనుమానం రాకుండా దళాలకు కొరియర్‌గా సమాచారాన్ని అందించే వాన్ని.  1947 స్వాతంత్య్రం వచ్చిన తరువాత సైన్యం గ్రామాలపై దాడులు చేస్తూ దళాలను ఏరివేసే పనిలో పడింది. కట్టంగూరు మండలం కల్మె ర గ్రామంలో సమీపంలోని తెల్లకుం ట వద్ద గుర్రాలపై వచ్చిన సైన్యం పాదూరి జానపరెడ్డి దళం పొలాల వద్ద పడుకున్న వారిపై దాడులు చేసి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో పొలం నుంచి పరిగెడుతున్న పాదూరి జానపరెడ్డిపై సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు వదిలారు. మా ఇల్లు ఊరి బయట ఉండడం వల్ల పిట్టగోడ పైనుంచి సైన్యం జరిపిన కాల్పులను స్వయంగా చూశాను. ఆ కాల్పుల్లో పాదూరి జానపరెడ్డి మరణాన్ని చూసిన నేను ఇప్పటికీ మరవలేకపోతున్నా. 


పెన్నా అనంతరామశర్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు

విముక్తి కోసం పోరాటం..
హాలియా (నాగార్జునసాగర్‌) :  రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజల కు విముక్తి కలిగించేందుకు త్యాగాలు చేశా రు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లల్లో మగ్గా రు.. ఆలిబిడ్డలకు దూరంగా అడవుల్లో ఉంటూ తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచారు.. త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెం, త్రిపురారం గ్రామాలకు చెందిన టంగుటూరి సత్యం, జొన్నలగడ్డ చల్మారెడ్డి, జొన్నలగడ్డ కోదండరామిరెడ్డి, కుందేటి సైదులు.  నిజాం నవాబులు, దొరలు ప్రజలపై దారుణాలకు పాల్పడుతుంటే తట్టుకోలేక వారి ఆగడాలకు అడ్డువేశారు. నేడు వారు మన నుంచి శాశ్వతంగా దూరమైనా వారు చేసిన పోరాట ఫలితంతో ప్రజలకు విముక్తి లభించింది. 

నిజాంకు వ్యతిరేకంగా పోరాడా..
నకిరేకల్‌ : నిజాం పాలనకు వ్యతిరేంగా పోరాడాను. నా 18వ ఏట సూర్యాపేట ప్రాంతంలో బాలెంలలో మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్లాను. ఆనాడు బాలెంల ప్రజలు నిజాం ప్రభుత్వ లేవీ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించి పోయినాను. రైతులంతా ఏకమై వారిని తరమారు. ఆ సమంలో బాలెంలకు చెందిన ఇద్దరు రైతులు అసువులు బాశారు. అక్కడి ప్రజలు, రైతుల ఆవేదన చూసి నిజాం వ్యతిరేకం పోరాటంలోకి దిగాను. ఆ సయమంలో మూసీ నది కేంద్రంగా సాయుధ పోరాట యోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చారు. అక్కడ కర్రసాము, కత్తిసాము, తూపాకి పేల్చడం వంటి శిక్షణలు పొందాను. నా చిన్నతనం నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా. నేను మునగాల పరగణాకు చేరుకుని రేపాల గ్రామంలో కోదాటి నారాయణరావు దళం బార్డర్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి రజాకారుల ఆగడాలను అరికట్టాడానికి కృషి చేశారు. దానిలో భాగంగా రామసముద్రం గ్రామంలో ఎనిమిది నెలలు ఉండి ఈ క్యాంప్‌కు వెళ్లి శ్రీరెడ్డి పెదవెంకట్‌రెడ్డి దళంలో పనిచేశాను. ఆ సమయంలో ఇటుకులపహాడ్‌లో మా ఇంటిని రజాకారులు తగులబెట్టారు.


పాలవరపు లక్ష్మీనర్సయ్య, సాయుధ పోరాట యోధుడు, నకిరేకల్‌ 

16 నెలలు జైలు జీవితం గడిపిన దొడ్డా..
చిలుకూరు (కోదాడ) : తెలంగాణ సాయుధ పోరాటంలో పటేల్, పట్వారీల దోపిడీని అడ్డుకోవడంలో కీలక భూమిక పోషించారు చిలుకూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకుడు దొడ్డా నారాయణరావు. ఉద్యమంలో భాగంగా 16 నెలల జైలు జీవితం గడపడంతో పాటు, దాదాపుగా మూడేళ్ల పాటు అడవిలో రహస్య జీవితం గడిపి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. చిలుకూరు గ్రామానికి చెందిన దొడ్డా అప్పయ్య, వెంకమ్మకు ఏడుగురు మగ సంతానం. వారిలో ఆరోవాడు దొడ్డా నారాయణరావు. ఈయన నాలుగో తరగతి వర కు చదువుకున్నాడు. నారాయణరావు అన్న హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య. దొడ్డా ఉద్యమంలోకి రావడానికే అన్నే స్ఫూర్తితో సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. దళాలకు కొరియర్‌గా పని చేశారు. 1948లో చిలుకూరులో ఐదుగురు సభ్యులతో కమ్యూనిస్టు పార్టీ సెల్‌ ఏర్పాటు చేసి నారాయణరావును కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1959లో చిలుకూరు పథమ సర్పంచ్‌గా దొడ్డా నారాయణరావు ఎన్నికయ్యాడు. 


దొడ్డా నారాయణరావు

బేతవోలు గడి కూల్చివేత..
తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అనాడు సూర్యాపేట తాలుకాలో ఉన్న బేతవోలు పరగణాలో బేతవోలు జమీందారు తడకమళ్ల సీతరామాచందర్‌రావు  కోటను తన అన్న దొడ్డా నర్సయ్య నాయకత్వంలో ఆరు వేల మందితో గడ్డపారాలతో పొడిచి తగుల బెట్టారు. నాలుగు రోజుల్లో కోటను కూల్చివేశారు. దొరకు చెందిన 1100 ఎకరాల భూమిని దొరల భూమిని, ఆస్తులను రైతులు స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top