కారు... జోరు | nalgonda district leaders join trs | Sakshi
Sakshi News home page

కారు... జోరు

Nov 23 2014 4:00 AM | Updated on Aug 29 2018 4:16 PM

సార్వత్రిక ఎన్నికలకు ముందు అంతంత మాత్రమే.. ఒకటో, రెండో ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు అనుకున్నారు... కానీ అనూహ్యంగా మారిన సమీకరణల

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికలకు ముందు అంతంత మాత్రమే.. ఒకటో, రెండో ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు అనుకున్నారు... కానీ అనూహ్యంగా మారిన సమీకరణల నేపథ్యంలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో జయకేతనం... అదే ఊపులో రాష్ట్రంలో అధికారం.. మంత్రి వర్గంలో స్థానం ...ఇంకేముంది ఆ పార్టీ ముఖచిత్రమే మారిపోయింది... జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సంస్థాగతంగా బలపడుతోంది... వార్డుసభ్యుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తుండడంతో ఇప్పుడు జిల్లా రాజకీయ ముఖచిత్రంలో టీఆర్‌ఎస్ కేంద్రబిందువుగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా, ఆ తర్వాత టీడీపీకి పటిష్టమైన పునాదిగా ఉన్న జిల్లాలో ఇప్పుడు గులాబీ పార్టీ వేనూళ్లుకుంటోంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవిస్తోంది.
 
 అందరి దారి అటువైపే...
 టీఆర్‌ఎస్ జిల్లాలో సంస్థాగతంగా బలపడుతుందనేందుకు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల సంఖ్యే నిదర్శనంగా నిలుస్తోంది.  ఐదు నెలల కాలంలో 1100 మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరడం గమనార్హం. గ్రామపంచాయతీ వార్డు సభ్యుల నుంచి పెద్దలసభలో సభ్యులైన ఎమ్మెల్సీల వరకు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన ముఖ్యుల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, రేపాల శ్రీనివాస్, రుద్రమదేవి, ఇతర పార్టీలకు చెందిన చింతల వెంకటేశ్వరరెడ్డి, రేగట్టె మల్లిఖార్జునరెడ్డి లాంటి ముఖ్య నేతలున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో 215 మంది సర్పంచ్‌లు, 120కిపైగా ఎంపీటీసీ సభ్యులు, 800 మంది వార్డు సభ్యులు, 30 మందికిపైగా కౌన్సిలర్లు, నలుగురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డెరైక్టర్లు ఉన్నారు. వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అంతకు ముందు పార్టీకి ఉన్న కొద్దో గొప్పో బలానికి తోడు వలసలు, అధికారం కూడా రావడంతో ఇప్పుడు జిల్లాలో కారు జోరు నడుస్తుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
 ‘మంత్ర’దండం అండగా..
 టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో పునాదులున్నా బలమైన శక్తిగా ఎప్పుడూ నిరూపించుకోలేకపోయింది. 2004లో ఆలేరులో మాత్రమే గెలిచిన టీఆర్‌ఎస్, 2009 ఎన్నికల నాటి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. ఆ పార్టీ 2014 ఎన్నికలలో మాత్రం అనూహ్యంగా ఆరుస్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అధికారంలోనికి రాగా, తొలి మంత్రివర్గంలోనే జిల్లాకు బెర్తు దక్కింది. సూర్యాపేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన  కేసీఆర్ సన్నిహితుడు జి. జగదీష్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలు గెలవడం, ఊహించినట్టుగానే మంత్రిపదవి రావడంతో జిల్లా టీఆర్‌ఎస్‌కు కొండంత బలం వచ్చినట్టయింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగదీష్‌రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీని గులాబీపరం చేసిన ఆయన తన నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే దాదాపు 250 మంది ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ గూటికి చే రడం గమనార్హం.
 
 అన్ని పార్టీలనుంచి...
 జిల్లాలో అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు జరుగుతుండగా, టీడీపీ నుంచి మాత్రం కొంచెం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ మున్సిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌లోనికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది టీడీపీ నుంచే ఉండడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి రావడం, టీడీపీలో ఉన్న గ్రూపు తగాదాలు లాంటి పరిణామాలు ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలను ప్రోత్సహించే అవకాశాలు లేకపోలేదు. ఇక, మిగిలిన పార్టీలపై కూడా టీఆర్‌ఎస్ నేతలు దృష్టి సారిస్తుండడంతో అన్ని పార్టీల నాయకులు తమ కేడర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మొత్తంమీద సార్వత్రిక ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని స్థానిక సంస్థల్లో పార్టీల బలాబలాలు మారుతుండడం, టీఆర్‌ఎస్ నానాటికీ బలోపేతం అవుతుండడం ఇటీవలి కాలంలో జరుగుతున్న ముఖ్య పరిణామమని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement