హ్యాట్రిక్‌.. వీరులు!

Nalgonda Constituency Winning Candidates - Sakshi

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 మంది నేతలు

వరుసగా మూడు విజయాలు సాధించిన జాబితాలో ఇద్దరు మహిళలు

హ్యాట్రిక్‌ దంపతులు ఎలిమినేటి మాధవరెడ్డి, ఉమామాధవరెడ్డి     

రద్దయిన రామన్నపేటలోనూ ఇద్దరి నాయకుల హ్యాట్రిక్‌ విజయాలు

నాగార్జున సాగర్, మునుగోడు, భువనగిరి, ఆలేరుల్లో 

 ఇద్దరు చొప్పున హ్యాట్రిక్‌ వీరులు 

హ్యాట్రిక్‌ జాబితాలో చోటు దక్కని సూర్యాపేట

 ఈ సారి ఎన్నికల్లో  మూడో విజయం కోసం పోటీ ఎవరూ లేని వైనం 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకసారి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడమే కష్టంగా భావిస్తున్న క్రమంలో వరసగా మూడు విజయాలు సాధిస్తే.. ఆ విజయాలను తక్కువగా అంచనా వేయలేం. మూడు దాటి నాలుగు, ఐదు, ఆరు, ఏడు సార్లు కూడా గెలుపొందిన నేతలు జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో పదిహేను మంది నేతలు హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. రద్దయిన రామన్నపేట నియోజకవర్గంలోనూ ఇద్దరు నాయకులు వరుసగా మూడేసి సార్లు విజయాలు సాధించారు. ఒక్క సూర్యాపేటలోనే వరుసగా మూడు పర్యాయలు గెలిచిన వారు లేకుండా పోయారు. సీపీఎం నుంచి ఉప్పల మల్సూరు ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన వరుస ఎన్నికల్లో గెలవక పోవడంతో హ్యాట్రిక్‌ దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో వరుసగా మూడో విజయం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధి ఒక్కరూ లేకపోవడం గమనార్హం. మూడో విజయం కోసం  ఆశపడుతున్న వారున్నా.. వారు వరుస విజయాలు సాధించిన వారు కారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు జానారెడ్డి వరసగా ఐదో విజయంపై, మొత్తంగా ఎనిమిదో గెలుపు కోసం ఎదురు చూస్తుండగా, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం ఈసారి బరిలో పోరాడుతున్నారు.  

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
 
(మునుగోడు) : ఒకే నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయలు విజయాలు సొంతం చేసుకున్న పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున హ్యాట్రిక్‌ పొందారు. ఆయన 1967, 1972, 1978, 1983లో వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 
 ఉజ్జిని నారాయణరావు (మునుగోడు) : పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి తర్వాత మునుగోడు నుంచి  ఉజ్జిని నారాయణరావు సీపీఐ తరఫున వరుసగా ఎన్నికల్లో గెలిచారు. ఆయన 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

ఎలిమినేటి మాధవరెడ్డి
 
(భువనగిరి) : జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీ తరఫున భువనగిరి నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచారు. ఆయన  1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయాలు సాధించారు. 

ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి

(భువనగిరి) : ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల చేతిలో హత్యకు గురి కావడంతో ఈ నియోజకవర్గం నుంచి ఆయన భార్య ఉమామాధవరెడ్డి 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఆమె వరుసగా 2004, 2009 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నారు.  

నర్రా రాఘవరెడ్డి 

(నకిరేకల్‌) : సీపీఎంకు తిరుగులేని విజయాలు సాధించి పెట్టిన నియోజకవర్గాల్లో నకిరేకల్‌ ఒకటి. ఆ పార్టీ నుంచి నర్రా రాఘవరెడ్డి ఏకంగా వరుసగా ఐదు పర్యాయాలు గెలిచారు. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నర్రా వరుసగా .. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో విజయాలు సాధించారు.

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 

(తుంగతుర్తి) : మొత్తంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన 1985, 1989లో కాంగ్రెస్‌ తరఫున, 1994లో ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత ఇదే స్థానం నుంచి 2004లో, సూర్యాపేట నుంచి 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఆరుట్ల కమలాదేవి 

(ఆలేరు ) : ఆలేరు నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల నుంచి వరుసగా మూడు సార్లు ఆరుట్ల కమలాదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 1952, 1957 ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా 1962లో సీపీఐ తరఫున పోటీ చేసి విజయాలు సాధించారు. 

మోత్కుపల్లి  నర్సింహులు

(ఆలేరు) : ఆలేరు నియోజకవర్గం నుంచి రెండో హ్యాట్రిక్‌ కూడా నమోదైంది. మోత్కుపల్లి నర్సింహులు ఇక్కడి నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపొందారు. ఆయన 1983, 1985లో టీడీపీ అభ్యర్థిగా, 1989లో ఇండిపెండెంటుగా, తిరిగి 1994 లో టీడీపీ నుంచి, 1999లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు.  

బద్దూచౌహాన్‌ 

(దేవరకొండ)  : స్థానికేతరుడైన బద్దూ చౌహాన్‌ ఎస్టీ రిజర్వుడు స్థానమైన దేవరకొండ నుంచి మూడు సార్లు గెలిచారు. సీపీఐ తరఫున ఆయన 1985, 1989, 1994 ఎన్నికల్లో దేవరకొండకు ప్రాతినిధ్యం వహించారు. 

నిమ్మల రాములు 
(నాగార్జున సాగర్‌): నాగార్జున సాగర్‌ నియోజకవర్గం చలకుర్తిగా ఉండిన సమయంలో నిమ్మల రాములు హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. 1962లో పెద్దవూర నియోజకవర్గంగా ఉన్నా, 1967లో చలకుర్తి నియోజకవర్గంగా మారింది. నిమ్మల రాములు1967లో ఇండిపెండెంట్‌గా, 1972,1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు.  

కుందూరు జానారెడ్డి 

(నాగార్జునసాగర్‌) : రాష్ట్రంలో మెజారిటీ విజయాలు సాధించిన జాబితాలో తొలి నేతగా ఉన్న కుందూరు జానారెడ్డి మొత్తంగా ఇప్పటి వరకు ఏడు పర్యాలు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1983, 1989 ఎన్నికల్లో టీడీపీ నుంచి, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వరుసగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండోసారి హ్యాటిక్‌ సాధించారు. 2009లో చలకుర్తి రద్దయి నాగార్జున సాగర్‌ నియోజకవర్గం ఏర్పడగా,  జానారెడ్డి 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇప్పుడు 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నారు. 

తిప్పన చిన కృష్ణారెడ్డి

మిర్యాలగూడ : కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే ఇప్పటిదాకా విజయాలు సాధించిన మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున తిప్పన చిన కృష్ణారెడ్డి 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.  

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 

హుజూర్‌నగర్‌ : టీ పీసీసీ సారథి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. తొలుత ఆయన కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004, హుజూర్‌నగర్‌ (2009లో ఏర్పాటైంది) నుంచి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.  

వేనేపల్లి చందర్‌రావు 

(కోదాడ) : కోదాడ నియోజకవర్గం నుంచి మొత్తంగా నాలుగు విజయాలు సాధించిన వేనేపల్లి చందర్‌రావు టీడీపీ నుంచి వరుసగా 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్‌ జాబితాలో చేరారు. 

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

(నల్లగొండ ) : ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోలేదు. వరుసగా గెలుపొందారు. ఇప్పుడు ఐదో విజయంపై కన్నేసిన ఆయన కాంగ్రెస్‌నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయాలు సాధించారు. 

రద్దయిన రామన్నపేట నుంచి 
2009 సార్వత్రిక ఎన్నికల నుంచి రామన్నపేట నియోజకర్గం నుంచి కూడా ఇద్దరు నేతలు హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. కె.రామచంద్రారెడ్డి : రామన్నపేట నియోజకవర్గం నుంచి కె.రామచంద్రారెడ్డి 1952, 1957, ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా, 1962లో సీపీఐ నుంచి గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.గుర్రం యాదగిరిరెడ్డి : రద్దయ్యే వరకు ఈ నియోజకవర్గం నుంచి కేవలం కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ అభ్యర్థులు మాత్రమే విజయాలు సాధించారు. కాగా, గుర్రం యాదగిరి రెడ్డి సీపీఐ అభ్యర్థిగా .. 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.     

మరిన్ని వార్తాలు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top