నోటుతో ఓటుకు చేటు.. | My Vote Is Not For Sale | Sakshi
Sakshi News home page

నోటుతో ఓటుకు చేటు..

Nov 15 2018 9:39 AM | Updated on Mar 6 2019 6:17 PM

My Vote Is Not For Sale  - Sakshi

సాక్షి, కొత్తకోట : ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యం మూలాలే దెబ్బతింటాయి. ఓటుకు నోటు దేశానికి చేటు. ఇదీ సామాజిక విశ్లేషకుల హెచ్చరిక. కానీ కొందరు స్వార్థపరులు.. రాజకీయ నాయకుల ముసుగులో పైసా, పలుకుబడి ఉపయోగించి వివిధ పార్టీల తరపున ఎన్నికల్లో నిలబడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీతో కుల, యువజన, మహిళా సంఘాల ముసుగులో ఓటర్లను లొంగదీసుకొని ప్రజాప్రాతినిథ్య చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

ఎంత సేపూ అభ్యర్థుల ఖర్చుపైనే దృష్టి పెడుతున్న అధికారులు, నగదు, కానుకల రూపంలో ఓటర్లపై విసురుతున్న ప్రజలోభాలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ ఏడాది కొత్తగా సీ విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టినా బాధ్యతాయుతమైన పౌరుల భాగస్వామ్యం లేనిది విజయవంతం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రాజ్యాంగం కల్పించిన హక్కు 
18 ఏళ్లు ప్రతీ పౌరునికి భాతర రాజ్యాంగం ఓటుహక్కును ప్రసాదించింది. పంచాయితీ మొదలు పార్లమెంటు వరకు ప్రతినిధులను ఎన్నుకుని పంపే అవకాశమిచ్చింది. కానీ తమ పేరు, పైసా, పలుకుబడి సాయంతో కొందరు అయోగ్యులు, అసమర్థులు, స్వార్థపరులు ఆయా పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడుతున్నారు. డబ్బు, మద్యం ఆశ చూపి, ఓటర్లకు ఎరవేస్తున్నారు. తీరా ఎన్నికల్లో గెలిచాక ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. కాగా నోటుకు ఓటు చేటు అనీ, ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యం మూలాలే దెబ్బతింటాయని సామాజిక విశ్లేషకులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. 

ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్లు..
ఎన్నికల సమంలో అభ్యర్థులలు విపరీతంగా డబ్బు ఖర్చు చేయకుండా నిరోదించేందుకు ‘రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టు (ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951)ను రూపోందించారు. దీని ప్రకారం ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి లోబడే అభ్యర్థులు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షల లోపు ఖర్చు చేసే వెసులుబాటును ఈసీ కల్పించింది. అంతకు మించి ఖర్చు చేస్తే అభ్యర్థిత్తమే రద్దయ్యే ప్రమాదముంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ‘ఆర్‌పీఏ’ నవ్వుల పాలవుతోంది.

ఉదాహరణకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ. 3 కోట్లు దాటినట్లు అంచనా! ఈసారి ఇంతకు రెట్టింపు ఖర్చు చేసే అవకాశమున్నట్లు ఈసీ గుర్తించి అధికారులను అప్రమత్తం చేసింది. కానీ ఆ స్థాయిలో ఖర్చు చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

చట్టం ప్రకారం పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, హోర్డింగులు, ర్యాలీలు, సభల నిర్వహణ, వాహనాలు, మైకుల వాడకం తదితర కార్యక్రమాలన్నీ నిర్దేశించిన మొత్తానికి లోబడే జరగాల్సి ఉంది. కేవలం దీనిపైనే దృష్టి పెడుతున్న అధికారులు, ప్రచారంలో డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. 

భారత శిక్షస్మృతి చట్టం ప్రకారం శిక్షార్హులు 
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం చట్టరీత్యా నేరం. ఓట్లు వేసేందుకు డబ్బులు ఇచ్చినా, ఓటు వేసేందుకు డబ్బులు కానీ, ఇతర వస్తువులు తీసుకున్నా చట్ట పరిధిలో శిక్షార్హులవుతారు. భారతీయ శిక్షాస్మృతి చట్టం 1860 ప్రకారం సెక్షన్లు 171బీ, 171ఈ ప్రకారం ఎన్నికల నియమావళిని అతిక్రమించిన అభ్యర్థులకు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు తీసుకున్న ఓటర్లకు సైతం ఇదే చట్టం వర్తిస్తుంది. అలాగే, 171సీ, 171 ఎఫ్‌ సెక్షన్ల కింద సైతం శిక్షార్హులవుతారు.  
– శ్రీనివాసరావు, సీఐ, కొత్తకోట  


వ్యాపారాన్ని తలపిస్తున్న ఎన్నికలు 
ప్రస్తుతం ఎన్నికలంటేనే వ్యాపారాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల్లో డ బ్బు ప్రభావం ఎక్కువైపోయింది. ప్రచారంలో నగదు, బహుమతుల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నిక ల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేసే అభ్యర్థి, తిరిగి వాటిని సంపాదించే లక్ష్యంతోనే ఉంటారు తప్ప ప్రజల సమస్యను పట్టించుకోరు. డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవారు అభ్యర్థులు గెలుపొందిన తరువాత పనులు ఎలా చేయించుకుంటారో ఆలోచించుకోవాలి. డబ్బు పంచుతూ ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది.  
– చంద్రశేఖర్‌రావు, న్యాయవాది    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement