ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌ | My Auto is Safe Address Registration in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌

Aug 10 2019 9:42 AM | Updated on Aug 16 2019 11:43 AM

My Auto is Safe Address Registration in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆటోలకు సంబంధించి అధికారిక రికార్డుల్లోని చిరునామాలు, ప్రస్తుతం వాటి యజమానులు/డ్రైవర్ల అడ్రస్‌లకు సంబంధం లేకపోవడంతో ప్రయాణికులకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటోలకు సంబంధించిన డేటాబేస్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాహనానికీ ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పోలీస్‌ నంబర్‌ కేటాయిస్తున్నారు. ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ పేరుతో దీన్ని చేపడుతున్నారు. శుక్రవారం నుంచి కమిషనరేట్‌లోని వివిధ కేంద్రాల్లో ఈ రిజిస్ట్రేషన్స్‌ జోరందుకున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ప్రయాణికులు తాము ప్రయాణించిన ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం కల్పించారు. దీని ఆధారంగా ఉత్తమ డ్రైవర్లకు రివార్డులు సైతం ఇవ్వాలని నిర్ణయించారు. 

అలానే 50 శాతం...   
రాజధానిలో దాదాపు లక్షన్నరకు పైగా ఆటోలు ఉండగా ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక ఆటోవాలాల ఉల్లంఘనల విషయానికి వస్తే నగరంలోని వాహనాల్లో వీటి వాటా 4శాతం లోపే కాగా... పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య మాత్రం 20 శాతం దాటుతోంది. మూడు కమిషనరేట్లలో ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారుల్ని అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్, బోగస్‌ నంబర్‌ ప్లేట్లతో తిరుగున్న వాహనాలు 40 శాతం వరకు ఉంటాయని పోలీసుల అంచనా. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న ఆటో డ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేది క్రాస్‌ చెక్‌ చేసేందుకు ఆర్టీఏ దగ్గర వనరులు లేవు. పోనీ నగరవ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ఇలాంటి వాటికి చెక్‌ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోజువారీ పనులే కష్టంగా మారాయి. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటో డ్రైవర్లు, యజమానుల తాజా వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

ఇలా డేటాబేస్‌..  
వాహనం ఎవరి పేరుతో ఉన్నప్పటికీ ప్రస్తుత యజమాని ఎవరు? ఎవరు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు? వారి చిరునామా, సెల్‌ నంబర్‌ తదితరాలను సమర్పించే డ్రైవర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కమిషనరేట్‌ వ్యాప్తంగా నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ నమోదు చేసిన డ్రైవర్లకు వెంటనే ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ మెటీరియల్‌ను అందిస్తున్నారు. ఇలా సేకరించిన వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరి«ధిలో సంచరించే ప్రతి ఆటో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆపై వీటిని పీడీఏ మెషిన్లకు అనుసంధానించి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్‌ అధికారులు తనిఖీ చేయాలని భావిస్తున్నారు. ఇలా డేటాబేస్‌ రూపొందించి ఒక్కో ఆటోకు ప్రత్యేకంగా పోలీసు నంబర్, క్యూర్‌ కోడ్‌ కేటాయిస్తున్నారు. ఈ వివరాలను ఆటో వెనుక భాగంలో ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో ప్రయాణించిన ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు. ఆ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు, ఇతర అభ్యంతరకర అంశాలుంటే దీని ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. ఇలా వచ్చే ఫిర్యాదుల్ని విచారించే పోలీసులు బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే నిర్ణీత కాలంలో ఉత్తమ ఫీడ్‌బ్యాక్‌ వచ్చిన ఆటో డ్రైవర్లను గుర్తించి, వారికి రివార్డులు సైతం ఇవ్వాలని నిర్ణయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement