మున్సిపల్‌ రిజర్వేషన్లపైనే..అందరి దృష్టి!

Muncipal Reservations Excitement In Nalgonda - Sakshi

నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు

24 వార్డులు జనరల్‌ కేటగిరీకి

ఎస్టీ–1, ఎస్సీలకు–7 , బీసీలకు 16 ..?

సాక్షి, నల్లగొండ: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వార్డుల పునర్విభజన, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణనతో పాటు వార్డు ఓటరు జాబితా ముసాయిదా సైతం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో అన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు ఈసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు సైతం అనుకూల రిజర్వేషన్ల  కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటాలని భావిస్తున్న ఆశావహులు తాము పోటీ చేద్దామనుకుంటున్న వార్డులు తమకు అనుకూల రిజర్వేషన్‌ వస్తుందా, లేక ఇతర సామాజిక వర్గాల వారీకి రిజర్వు అవుతుందా అన్న అంచనాల్లో మునిగిపోయారు. నల్లగొండ మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి 48 వార్డులకు పెరిగింది. పట్టణంలో 1,24,117 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య ప్రకారం వార్డు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. 

24 వార్డులు జనరల్‌..! 
నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నందున 24 వార్డులు జనరల్‌ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత  ఉన్నా రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 వార్డులు మాత్రం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయి. పట్టణంలో తక్కువ సంఖ్యలోనే దాదాపు 1400 వరకు గిరిజన ఓటర్లు ఉన్నందున వారికి ఒక వార్డు రిజర్వు కానుంది. 48 వార్డులలో 24 జనరల్, ఒకటి ఎస్టీలకు రిజర్వు కానుండగా ఇంకా 23 వార్డుల ఉంటాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ 23 వార్డులలో 7 వార్డులు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన 16 వార్డులు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఎస్సీలకు 1 వార్డు పెరిగి 8 అయితే బీసీలకు 1 వార్డు తగ్గి 15 వార్డులు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీలకు కేటాయించే వార్డుల్లో ఒకటి అటు, ఇటు అయినా.. దాదాపు ఈ సంఖ్య ప్రకారమే వార్డుల రిజర్వేషన్‌ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

భారీగా పెరిగిన బీసీ ఓటర్లు 
2014 మున్సిపల్‌ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా  పెరిగింది. ముస్లిం ఓటర్లను ఎక్కువ సంఖ్యలో బీసీ సామాజిక వర్గంలో కలపడంతోనే  బీసీ ఓటర్లు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీంతో పట్టణంలో ఓసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పెరిగిన ఓటర్ల ప్రకారం ప్రస్తుతం మున్సిపాలిటీలో సుమారుగా ఓసీ ఓటర్లు 27 వేలు,  బీసీ ఓటర్లు 77,350, ఎస్సీ ఓటర్లు 18,750, ఎస్టీ ఓటర్లు 1450 మంది ఉన్నట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top