ప్రతీ తల్లి బాధ్యతగా పెంచాలి..

MP Kavitha And Muhammad Ali On International Womens day - Sakshi

‘విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌’ ప్రారంభోత్సవంలో ఎంపీ కవిత

తెలంగాణ పోలీసింగ్‌ దేశానికే ఆదర్శం: హోంమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. ప్రతీ తల్లి తన కుమారుడి తీరును గమనిస్తూ ఉండాలని, అబ్బాయిలకు ఆడవాళ్లపై గౌరవభావం కలిగేలా వారిని పెంచాలని చెప్పారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్బంగా ‘విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌’ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు మహిళా భద్రతకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని తెలిపారు. నిధుల కేటాయింపు, విడుదల వరకు ఎక్కడా జాప్యం జరగలేదన్నారు. ఆడపిల్ల భద్రంగా ఉంటేనే ఏ నగరానికైనా మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ పోలీసింగ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఏటా నేరాల శాతం తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమని హోంమంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్‌ షీటీమ్స్, భరోసా కేంద్రాలతోపాటు విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌లను రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించారన్నారు.  

విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి: డీజీపీ 
హైదరాబాద్‌ మహిళలకు సురక్షితమైన నగరమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. 2014 నుంచి పోలీసులకు సంబంధించి పరిపాలనా పరంగా అనేక మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. ఇటీవల భరోసా కేంద్రాలను సుప్రీంకోర్టు అభినందించిందని, తప్పకుండా విమెన్‌ సేఫ్టీ వింగ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న పలు నేరాల దర్యాప్తు, వారికి అందించే న్యాయపరమైన సేవలను ఒకే గొడుగు కిందకు ‘విమెన్‌ సేఫ్టీ వింగ్‌’ద్వారా తీసుకువచ్చామని ఆ వింగ్‌ చీఫ్, ఐజీ స్వాతీ లక్రా తెలిపారు. ఇకపై ఇలాంటి నేరాల విచారణ వేగంగా జరిగేలా ఇక్కడ నుంచే నిరంతర పర్యవేక్షణ జరుపుతామన్నారు. ఈ సెల్‌కు సంబంధించి వెబ్‌సైట్, వాట్సాప్, ఫేస్‌బుక్, హాక్‌ ఐ ద్వారా మహిళలు న్యాయసేవలు, ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. తక్కువ సమయంలోనే కార్పొరేట్‌ తరహాలో అధునాతన భవనాన్ని నిర్మించి అందించిన టీపీఎస్‌హెచ్‌ఎల్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్, ఎండీ మల్లారెడ్డిలకు సీఐడీ ఎస్పీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top