అమ్మకు ‘కాన్పు’ కష్టం! | Mother can not be 'hard'! | Sakshi
Sakshi News home page

అమ్మకు ‘కాన్పు’ కష్టం!

Sep 30 2017 2:58 AM | Updated on Aug 30 2018 4:15 PM

Mother can not be 'hard'! - Sakshi

కొత్తగూడెం రూరల్, గుండాల: అమ్మకు ‘కాన్పు’ కష్టం వచ్చింది.. ఆస్పత్రి బెడ్‌పై సురక్షితంగా బిడ్డకు జన్మనివ్వాల్సిన అమ్మ.. ఆటోలో, ఎడ్ల బండిపై ప్రసవిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక చోట.. రహదారి సౌకర్యం సరిగా లేక 108 అంబులెన్సు వెళ్లక మరో చోట.. ప్రమాదకర పరిస్థితుల్లో కాన్పు జరగాల్సిన దుస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ రెండు ఘటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగాయి.

వైద్య సిబ్బంది పట్టించుకోక..
కొత్తగూడెంలోని మేదరబస్తీకి చెందిన పూజ నిండు గర్భిణి. భర్త కూలీ పనులకు వెళ్లగా.. ఉదయం 10.30 సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవిత అనే మహిళ మృతిచెందిందంటూ ఆమె బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నారు.

దీంతో ఆస్పత్రి సిబ్బంది ఎవరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఈ సమయంలో ఆటోలో వచ్చిన పూజకు నొప్పులు తీవ్రమై నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమెను స్ట్రెచర్‌పై ఆస్పత్రిలోకి తీసుకెళ్లాలని బంధువులు వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆటోలోనే పూజ ప్రసవించింది. చివరికి కొందరు వ్యక్తులు కలసి పూజను చేతులపై మోసుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.

వాగులు దాటి రాలేక..
కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎలగలగడ్డకు చెందిన ఇర్ప సుగుణ నిండు గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు పురుటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు గుండాల 108కు సమాచారం అందించారు.

అయితే మార్గంలో రెండు వాగులు ఉన్నందున అంబులెన్సు అక్కడివరకు రాలేదని, ఎడ్ల బండిపై కొంత దూరం తీసుకురావాలని వారు సూచించారు. దీంతో బంధువులు సుగుణను ఎడ్ల బండిపై తరలిస్తుండగా.. సాయనపల్లి సమీపంలోని జమ్మిచెరువు ప్రాంతంలో బిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే అక్కడికి చేరుకున్న 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement