11న రాష్ట్రానికి రుతుపవనాలు

Monsoon Will Arrive On 11th June To Telangana - Sakshi

ఈసారి కాస్త ఆలస్యంగా 6న కేరళను తాకనున్న ‘నైరుతి’

96% వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా

ప్రకటించిన తేదీకి నాలుగైదు రోజులు అటు ఇటు అయ్యే చాన్స్‌

అండమాన్‌ తీరంలోనైరుతి రుతుపవనాల జాడ

అప్పటివరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువేనని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణకు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఇవి జూన్‌ 11వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దానికిముందు జూన్‌ ఆరో తేదీన కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అండమాన్‌ దీవుల సమీపంలో సముద్రంపై రుతుపవనాల సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో కేరళలో రుతుపవనాలు కొద్దిగా     మిగతా 2వ పేజీలో u

ఆలస్యం కానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని భావిస్తుండగా.. ఈ సమయానికి నాలుగైదు రోజులు అటు ఇటుగా రావడం ఖాయమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళను తాకాయి. ఆ తర్వాత జూన్‌ 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈసారి కేరళను తాకిన ఐదు రోజులకు అంటే 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.
 
ఈసారి 96% వర్షాలు
సాధారణంతో పోలిస్తే ఈసారి 96% వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ లెక్క దాదాపుగా సాధారణ వర్షాపాతం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో నైరుతి సీజన్‌ సాధారణ వర్షపాతం 755.1 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 96% లెక్కన ఈసారి 717 ఎంఎంలు నమోదయ్యే అవకాశముంది. అయితే గతేడాది ఇదే సీజన్‌లో సాధారణానికి దగ్గరగా 97% వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ వెల్లడించినా 92 శాతం వర్షమే కురిసింది. ఐదు శాతం లోటు నమోదైంది. 2016లో సాధారణం కంటే ఏకంగా 19% అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి.

కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని వాతావరణాధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే గతేడాది ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అప్పుడు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసిన తేదీల్లోనే రుతుపవనాలు ప్రవేశించడం విశేషం. జూన్‌ 4–8 తేదీల మధ్య తెలంగాణలోకి నైరుతి ప్రవేశిస్తుందని ప్రకటించగా, ఆ ప్రకారమే 8వ తేదీన రావడం గమనార్హం. ఈసారి 11వ తేదీన వస్తాయని, నాలుగైదు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చంటున్నారు.
 
గతేడాది 17 జిల్లాల్లో వర్షాభావం

గతేడాది నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా ఉండటం, ఆ తర్వాత వచ్చిన ఈశాన్య రుతుపవనాలూ అంతంత మాత్రంగానే ఉండటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో నీటి వనరులు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడింది. తెలంగాణలో గత 3నెలలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వివరించింది. మొత్తంగా చూస్తే 17 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వరంగల్‌ (రూరల్‌), రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top