పేలిన మొబైల్‌ బ్యాటరీ

Mobile Battery Blast in Ramagundam Karimnagar - Sakshi

ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు

చెత్తకుప్పలో దొరికిన పాతమొబైల్‌ బ్యాటరీ

ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలిన బ్యాటరీ

తెగిపోయిన చేతివేళ్లు, కంటి చూపునకు ప్రమాదం

చికిత్స కోసం కరీంనగర్‌కు తరలింపు  

కోల్‌సిటీ(రామగుండం): సెలవుల్లో ఇంటి దగ్గర సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థులు పాతమొబైల్‌బ్యాటరీ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. చెత్తకుప్పలో దొరికి మొబైల్‌పాత బ్యాటరీతో ఆడుకుంటుండగా... అకస్మాత్తుగా బ్యాటరీ పేలింది. ఇద్దరివీ రెండు చేతివేళ్లు తెగిపోగా, కంటి చూపు ప్రమాదంగా మారింది. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గోదావరిఖనిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత పిల్లల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన గుంటి వేణు రమేష్‌నగర్‌లోని మైనార్టీ గురుకుంలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఎదిరింట్లో ఉంటున్న గూడెల్లి అఖిల్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు.

సెలవులివ్వడంతో వేణు బుధవారం ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం వేణు,అఖిల్‌ కలిసి ఇంటిసమీపంలో ఆడుకుంటుండగా, చెత్తకుప్పలో పాతస్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీతోపాటు రెండు వైర్లతో ఉన్న ఓ ఎలక్ట్రానిక్‌ వస్తువు దొరికింది. ఎలక్ట్రానిక్‌ వస్తువుకు ఉన్న రెండు వైర్లను పాతబ్యాటరీకి అనుసంధానం చేశారు. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలింది. పేలిన శబ్దంకు సమీపంలోనే ఉన్న పిల్లల కుటుంబ సభ్యులు హుటాహుటిన వెళ్లి చూడగా, అప్పటికే ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు అయ్యాయి. అఖిల్‌కు ఎడమ కంటికి తీవ్రమైన గాయం కావడంతోపాటు ఎడమ చెయ్యి రెండు వేళ్లుకు కూడా గాయాలయ్యాయి. వేణుకు ఎడమ చేయి బొటన వేలు, కుడి చేయి చూపుడు వేలు నుజ్జునుజ్జు అయి తెగిపోయాయి. కడుపులు, ముఖంపై స్వల్పగాయాలయ్యాయి. తొలత గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్స్‌లో ఇద్దరు పిల్లలను తలరించారు. కాగా ఈ ప్రమాదంతో కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top