ముంబైసే ఆయా మేరా దోస్త్‌

Minister Padma Rao Goud Meets His Childhood Friend After 40 Years - Sakshi

ఫేస్‌బుక్‌ ద్వారా బాల్యమిత్రుడిని కలిసిన మంత్రి పద్మారావు గౌడ్‌ 

విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం 

40 ఏళ్ల తరువాత కలిసిన ఆనందంలో ఇద్దరు స్నేహితులు 

సాక్షి, హైదరాబాద్‌‌: వారిద్దరు బాల్యమిత్రులు. పుట్టింది మొదలు 20 ఏళ్ల వయసు వరకు ఇరువురు సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో బాల్యమిత్రుల్లో ఒకరు కుటుంబంతో సహా మకాం మార్చారు. అప్పట్లో ఫోన్ల సదుపాయం లేని కారణంగా స్నేహబంధం దూరమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరిని తిరిగి ఫేస్‌బుక్‌ దగ్గర చేసింది. సోమవారం రాత్రి ఇరువురు మిత్రులు శంషాబాద్‌ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇందులో ఒకరు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్‌. మోండాలోని టకారాబస్తీలో మంత్రి పద్మారావు పుట్టి పెరిగారు. ముంబై నుంచి కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్టియన్‌ కుటుంబం నగరానికి వలస వచ్చింది. మోండా మార్కెట్‌లో స్థిరపడిన ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జాకబ్‌ విక్టర్‌. పద్మారావుగౌడ్, జాకబ్‌విక్టర్‌ ఇరువురు బాల్యమిత్రులు. 20 ఏళ్ల వయసులో జాకబ్‌ విక్టర్‌కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. నాలుగు దశాబ్దాలుగా ఇరువురు కలుసుకోలేకపోయారు.  

ఫేస్‌బుక్‌ చూస్తుండగా... 
ఎయిర్‌ఫోర్స్‌లో పదవీ విరమణ చేసిన జాకబ్‌ విక్టర్‌ కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌ పరిశీలిస్తుండగా మంత్రి పద్మారావు ఫొటోలు కనిపించాయి. సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్‌ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావుగౌడ్‌ తన బాల్యమిత్రుడేనని గుర్తించిన జాకబ్‌విక్టర్‌ అందులోని ఫోన్‌నెంబర్‌కు కాల్‌చేశాడు. ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న మంత్రి పీఆర్‌ఓ కలకోట వెంకటేశ్‌ జాకబ్‌ ముంబై నుంచి ఫోన్‌ చేసిన విషయాన్ని మంత్రికి చేరవేశారు. బాల్యమిత్రుడి ఆచూకీ లభించడంతో హర్షం వ్యక్తం చేసిన పద్మారావుగౌడ్‌ హైదరాబాద్‌ రావాల్సిందిగా జాకబ్‌ విక్టర్‌ను ఆహ్వానించారు.  

స్వయంగా మంత్రి స్వాగతం... 
సోమవారం రాత్రి ముంబై నుంచి నగరానికి చేరుకున్న జాకబ్‌ విక్టర్‌కు మంత్రి పద్మారావు స్వయంగా ఎయిర్‌పోర్టుకు  వెళ్లి స్వాగతం పలికారు. టకారాబస్తీలోని మంత్రి నివాసంలో బసచేసిన జాకబ్‌ విక్టర్‌ మంగళవారం మంత్రి పద్మారావుతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పొరేటర్లతో బాల్యం నాటి ముచ్చట్లను ఇరువురు పంచుకున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top