మిల్లర్లు..మింగేశారు | millers..swallow | Sakshi
Sakshi News home page

మిల్లర్లు..మింగేశారు

Oct 11 2014 1:39 AM | Updated on Sep 2 2017 2:38 PM

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం సుల్తానాబాద్ ప్రాంతంలోని పలు మిల్లులపై సివిల్ సప్లయిస్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
 వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం సుల్తానాబాద్ ప్రాంతంలోని పలు మిల్లులపై సివిల్ సప్లయిస్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, ధాన్యం నిల్వలను పరిశీలించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. లాభసాటిగా ఉంటుందని ఈ బియ్యాన్ని విదేశాలకు అమ్ముకున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మిగిలిపోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై కొరడా ఝుళిపించాలని అధికారులు యోచిస్తున్నారు.

   గత ఏడాది రబీ సీజన్‌లో సివిల్ సప్లయిస్ విభాగం జిల్లావ్యాప్తంగా కొనుగోలు చేసిన 4.32 లక్షల టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌కు అప్పగించింది. ఒక్కో క్వింటాలుకు 70 కిలోల బియ్యాన్ని తిరిగి అప్పగించాలని.. మిల్లింగ్ ఖర్చులకు రూ.26 చొప్పున చార్జీలు చెల్లించే ఒప్పందంపై మిల్లులకు చేరవేశారు. నెలరోజుల వ్యవధిలో ఈ బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సిన మిల్లర్లు.. రేపుమాపంటూ దాట వేశారు. ఇప్పటివరకు 1.66 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మిల్లుల్లోనే ఆగిపోయింది. దాదాపు 250 మిల్లులు ఈ ధాన్యాన్ని తిరిగి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు.

   ఇంతకీ ఈ బియ్యాన్ని ఏం చేశారు.. ఎక్కడికి తరలించారు.. అని ఆరా తీస్తే అసలు వ్యాపారం
 వెలుగులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అంతకంతకు పెరిగిపోవటంతో తమ గుప్పిట్లో చిక్కిన కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని సైతం మిల్లర్లు వ్యాపార సాధనంగా మలుచుకున్నారు. ఎక్కువ లాభం పొందే ఆలోచనతో ఈ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముకున్నారు. విదేశాల్లో గిరాకీ ఉం డటంతో జిల్లాలోని మిల్లర్లు ఇందులో నలభై శాతం బియ్యా న్ని ఎగుమతి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

     జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లో ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ  ద్వారా 10.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందులో 6.89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 5.23 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించారు. మిగతా 1.66 లక్షల టన్నుల ధాన్యం జిల్లా దాటి వెళ్లింది.

     ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 30లోగా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ప్రస్తుతం ఎఫ్‌సీఐ కస్టమ్ మిల్లింగ్‌కు ఇచ్చే బియ్యం ధర సగటున క్వింటాల్‌కు రూ.1600 ఉంది. ఈ ధర ప్రకారం లెక్కలేసినా మిల్లర్లు అమ్ముకున్న బియ్యం ధర రూ.265 కోట్లు దాటుతోంది. భారీ మొత్తంలో వ్యాపారం కావటంతో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. కోట్లాది రూపాయల వ్యాపారంతో భారీగా లబ్ధి పొందే ఎత్తుగడలు వేస్తున్నారు. అందుకే.. సర్కారు విధించిన గడువును తేలిగ్గా తోసి పారేస్తున్నారు.

     దీంతో పౌర సరఫరాల విభాగం ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేక పోతోంది. మిల్లింగ్ బియ్యం సేకరణకు మరో నెల గడువు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవటంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు.. నిల్వలకు పొంతన లేకపోవటంతో మిల్లర్ల లీలలు చూసి అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement