తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఐదుగురిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన బులెటిన్‌పై సోమవారం శాసనమండలి దద్దరిల్లింది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఐదుగురిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన బులెటిన్‌పై సోమవారం శాసనమండలి దద్దరిల్లింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగిలారు. చైర్మన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపించింది. అయితే, రాజ్యాంగానికి అనుగుణంగానే తాను నిర్ణయం తీసుకున్నానని, ఎవరికైనా సందేహాలు ఉంటే తనకు నోటీసు ఇవ్వాలని చైర్మన్ స్వామిగౌడ్ స్పష్టం చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే గవర్నర్ ప్రసంగంపై ప్రసంగించాల్సిందిగా చైర్మన్ సభ్యులను కోరారు. టీఆర్‌ఎస్ సభ్యులు ఒకరిద్దరు మాట్లాడాక తమ సభ్యులు ఐదుగురిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీకి చెందిన ఎ. నర్సారెడ్డి మాట్లాడుతూ పెద్దల సభ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా అని మండిపడ్డారు.
అధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదని, పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు మండలికి లేదని ఎమ్మెలీ నాగేశ్వర్ అన్నారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. దీనికి స్వామిగౌడ్ సమాధానం ఇస్తూ నిబంధనలకు లోబడే విలీనం నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మంగళవారం టీడీపీ సభ్యులను తన ఛాంబర్‌కు పిలిచి సలహా తీసుకుంటానన్నారు. దీనికి శాంతించని టీడీపీ సభ్యులు సభలో మరింత రభస చేశారు.
మండలి ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు విలీనం చేశామని బులిటెన్ విడుదల చేస్తే ఎలా అని... ఇలా అయితే భవిష్యత్తులో ఏ పార్టీ వారినైనా ఇలా చేసే అవకాశం ఉందన్నారు. ఇందులో వాస్తవాలను సభకు చెప్పాలని చైర్మన్‌ను కోరారు. టీఆర్‌ఎస్ చెప్పినట్టు విలీనం చేశారని టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి అనడంతో స్వామిగౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లు భావిస్తే నోటీసు ఇవ్వాలని, దానిపై సభలో చర్చకు సిద్ధమని స్వామిగౌడ్ అనడంతో... మంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకొని ‘చైర్మన్ నిర్ణయం ఫైనల్. దీనిపై చర్చ అవసరమే లేద’ని పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.
గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కరపత్రంలా ఉంది..
గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కరపత్రంలా, ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలా ఉందని డీఎస్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంతో ఒరిగేదేమీలేదన్నారు. తాము గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ‘కేసీఆర్ చాలా మాటలు చెప్పగలరు. అంతా జరిగిపోయినట్లే భ్రమింపజేయగలరు. అందులో ఆయన దిట్ట’ని విమర్శించారు. బంగారు తెలంగాణ కాంగ్రె స్ నినాదమని... ఈ ప్రభుత్వం వజ్రాల తెలంగాణ తీసుకురావాలని ఆయన కోరారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ సోనియానే తెలంగాణ ఇచ్చిందని తాము కూడా అంటున్నామని... ఇంతమంది బలిదానానికి కూడా కారణం ఆమేనని విమర్శించారు. టీఆర్‌ఎస్ సభ్యులు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్‌లు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం బ్రహ్మాండంగా ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌లో టీడీపీ ఎమ్మెల్సీల విలీనం
హైదరాబాద్: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అధికారికంగా గుర్తించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి రాజాసదారాం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధన ప్రకారం మండలిలోని టీడీపీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది(ఐదుగురు) టీఆర్‌ఎస్‌లో చేరినందున వారిని టీఆర్‌ఎస్ సభ్యులుగా పరిగణిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు, బి.లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, మహ్మద్ సలీంను ఇకపై టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తిస్తామని, ఆ మేరకు వారికి సీట్లు కేటాయిస్తామని శాసనసభ కార్యదర్శి స్పష్టంచేశారు.
టీడీపీకున్న ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు తాము టీఆర్‌ఎస్‌లో విలీనమవుతున్నట్లు గత నవంబర్ 3న కౌన్సిల్ చైర్మన్‌కు ఉమ్మడిగా, వ్యక్తిగతంగా లేఖలు సమర్పించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో పేర్కొన్న మేరకు తమ సంఖ్య మొత్తం పార్టీ సభ్యుల్లో మూడోవంతు ఉన్నందున ఈ విలీనాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా మండలి చైర్మన్ ఇందుకు ఆమోదం తెలి పారు. ఈ మేరకు తమకు అధికారికంగా సమాచారం అందినట్లు ఆ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో స్వయంగా వెల్లడించారు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో (బీఎస్పీ) నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప తాము టీఆర్‌ఎస్‌లో విలీనమవుతున్నట్లు రాసిన లేఖలకు శాససనసభ స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని గుర్తిస్తున్నట్లు తాజాగా బులెటెన్ విడుదలైంది. దీంతో వారిద్దరూ అధికారికంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందినట్లయింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కాగజ్‌నగర్ నుంచి కోనప్ప బీఎస్పీ తరఫున శాసనసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.