‘తెలంగాణ సవారీ తరహాలో యాప్’

Meeting On Metro Rail And RTC Connected In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై మంగళవారం నగరంలో సమావేశం జరిగింది. తెలంగాణ సవారీ తరహాలో యాప్‌ రూపొందిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ ఎండీ, మైట్రోరైలు ఎండీలతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంతేకాక అనుసంధానంపై కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎస్‌ ఇంచార్జి ఎండీ సునీల్‌ శర్మ మాట్లాడుతూ.. మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై టాస్క్‌ ఫోర్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు ట్రాకింగ్ పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

‘వాహనాల ట్రాకింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేసేందుకు ఆలోచిస్తున్నాం. ప్రైవేట్ వాహన సంస్థలతో పేమెంట్స్‌ పై చర్చ జరిపాం. ప్రజలకు వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆలోచన చేస్తున్నాము.మొదటి మీటింగ్ నిర్వహించాం. రేపు కూడా మళ్లీ సమావేశం ఉంటుంది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణ అనుసంధానం పై 2నెలల్లో ప్రణాళికలు రూపొందిస్తాం. గ్రేటర్ సిటీలో ఆర్టీసీ, మెట్రో కలిసి పని చేయాలి.
 గ్రేటర్ సిటీలో మెట్రో, ఆర్టీసీ కలిసేందుకు మొదటి ప్రయత్నం చేస్తున్నాం. 18వందల బస్సులకు ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం ఉంది. మిగతా వాటికి కూడా ఏర్పాటు చేస్తాం. పేదలకు నష్టం కలుగకుండా ప్రణాళికలు చేస్తున్నాం. మెట్రో, ఆర్టీసీ, ఓలా, ఉబర్ సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం. ప్రజల అవసరాలు, రద్దీని బట్టి ఆర్టీసీలో మార్పులు ఉంటాయి. ఆర్టీసీలో కొత్త కమిటీ వేశాం.. త్వరలోనే ప్రకటన చేస్తాం’ అని ఎండీ సునీల్‌ వర్మ తెలిపారు.

మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే.. వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయన్నారు. తెలంగాణ సవారీ తరహాలో యాప్ రూపొందిస్తామని ఆయన తెలిపారు.  సిటీలో ఆర్టీసీలో 33లక్షల మంది, ఎంఎంటీఎస్‌లో 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మెట్రోలో ప్రస్తుతం 8వేల మంది ప్రయాణం చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ‘గ్లోబల్ కంపెనీలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నాయి. బెంగుళూరు తరహాలో ట్రాఫిక్ లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను టాస్క్ ఫోర్స్ చేస్తది. నగరంలో ట్రాఫిక్ తగించడంతో పాటు సుఖవంతమైన ప్రయాణం కోసం కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కడలేని విధంగా మెట్రో రైల్‌ని రూపొందిస్తున్నాం. జీఎచ్‌ఎంసీ ద్వారా గ్రేటర్‌లో బస్ షెల్టర్ నిర్మాణం జరుగుతుందని’ ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top