సిలిండర్‌ పేలుళ్లకు పరిహారమేదీ?

LPG Blast Victims Can Claim Insurance From Oil Companies In Telangana - Sakshi

ఎల్పీజీ వినియోగదారులకు ఎండమావిలా బీమా భద్రత

ప్రాణ నష్టానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్‌ ఉన్నా అందని వైనం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏటా ప్రమాదవశాత్తూ వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లకు వందలాది మంది బలవుతున్నా, భారీగా ఆస్తినష్టం సంభవిస్తున్నా బాధిత కుటుంబాలు చట్ట ప్రకారం పొందాల్సిన బీమా పరిహారానికి నోచుకోవడంలేదు. ప్రమాదాలకు గురయ్యే ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు కనీస అవగాహన లేకపోవడం, చమురు సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్దగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఈ ప్రమాదాలకు బీమా సదుపాయం ఉందని తెలిసిన అతికొద్ది మందికే తూతూమంత్రంగా పరిహారం దక్కుతోంది. గత పదేళ్లలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్ల కారణంగా తెలంగాణలో 657 మంది మృతిచెందగా కేవలం 25 మందికే బీమా పరిహారం అందగా దాదాపు 2,300 మంది క్షతగాత్రుల్లో ఏ ఒక్కరికీ పరిహారం లభించలేదు. అలాగే ఈ ప్రమాదాల్లో 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమైతే ఆస్తి నష్టం కింద బాధితులకు పైసా పరిహారం కూడా దక్కలేదు. 
చమురు సంస్థలు ప్రీమియం చెల్లిస్తున్నా...

ఏదైనా కారణం చేత వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలుడు సంభవించి ఎవరైనా మరణించినా, ఆస్తులకు నష్టం వాటిల్లినా బీమా పరిహారం తప్పనిసరి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు తమ పబ్లిక్‌ లయబిలిటీ పాలసీని అనుసరించి (పాలసీ నంబర్‌ 021700/ 46/14/37/0000041) ఒక్కో వ్యక్తి మరణానికి రూ. 5 లక్షల చొప్పున, ఒక్కో క్షతగాత్రుడికి గరిష్టంగా రూ. లక్ష చొప్పున, ప్రమాదం మొత్తంమీద గరిష్టంగా రూ. 15 లక్షలను వైద్య ఖర్చుల కింద బీమా పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఆస్తి నష్టానికి గరిష్టంగా రూ. లక్ష పరిహారం అందించాల్సి ఉంది.

ఈ మేరకు ఆయిల్‌ కంపెనీలు బీమా కంపెనీలకు ప్రీమియం (పర్‌ సిలిండర్‌) చెల్లిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. 2010 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వాడకం 28 శాతం ఉండగా ఇప్పుడది 83 శాతానికి పెరిగింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏటేటా 11 శాతం నుంచి 13 శాతం మేర కనెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటే సిలిండర్‌ పేలుడు ప్రమాదాలూ ఎక్కువవుతున్నాయి.
 
వినియోగదారులు, డీలర్లలో అవగాహనలేమి... 
ఎల్పీజీ వినియోగదారుల్లో అత్యధిక శాతం మందికి బీమా సదుపాయం ఉందన్న సంగతే తెలియదు. పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మంది వినియోగదారులు, 60 శాతం మంది డీలర్లకు బీమా సదుపాయం గురించి అవగాహన లేదని విస్తరణ మాస్‌ కమ్యూనికేషన్‌ సొసైటీ పరిశీలనలో బయటపడింది. ఈ విషయంలో వినియోగదారులు, డీలర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలేవీ ఆయిల్‌ కంపెనీలు చేపట్టడం లేదు. ఆయిల్‌ కంపెనీలు తమ నుంచి సరఫరా అయ్యే ప్రతి సిలిండర్‌కు ప్రీమియం చెల్లిస్తున్నా ప్రచారం చేయకపోవడంతో వినియోగదారులు, డీలర్లకు దీని గురించి తెలియడంలేదు. తమిళనాడు, కేరళ మినహా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సిలిండర్‌ పేలుళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం గమనించిన పరివర్తన్‌ మరఠ్వాడా అనే స్వచ్ఛంద సంస్థ బాధిత కుటుంబాల చేత స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించి మరీ బీమా కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తోంది.

వీరెవరికీ పరిహారం రాలేదు

  • గతేడాది నవంబర్‌ 19న హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో ఉన్న అడ్డగుట్టలో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలి దినేష్‌ అనే టీనేజర్‌ మరణించడంతోపాటు ఇల్లు ధ్వంసమైంది. నిబంధన ల ప్రకారం అతని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల మేర బీమా పరిహారం, ఇల్లు ధ్వంసమైనందుకు మరో రూ. లక్ష అందాల్సి ఉన్నా అందలేదు.
  • 2017 మార్చి 27న హిమాయత్‌నగర్‌లోని శ్యామల బుచ్చమ్మ ఇంట్లో సిలిండర్‌ పేలడంతో ఇల్లు సగభాగం ధ్వంసమైంది. దాదాపు రూ. 25 లక్షల మేర నష్టం వాటిల్లినా నిబంధనల మేరకు రావాల్సిన లక్ష పరిహారం కూడా రాలేదు.
  • గతేడాది జూలై 26న కుల్సుంపురాలో సిలిండర్‌ పేలుడు ప్రమాదంలో రామకృష్ణ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎవరికీ పైసా బీమా పరిహారం అందలేదు.
  • యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో గతేడాది సెప్టెంబర్‌ 4న సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి రూ. 10 లక్షల మేర బీమా రావాల్సి ఉన్నా ఆయిల్‌ కంపెనీగానీ, ఎల్‌పీజీ డీలర్‌గానీ పట్టించుకోలేదు.

డీలర్ల నిర్లక్ష్యమే... 
వినియోగదారులు లేదా గోడౌన్లలో పని చేసే సిబ్బంది ప్రమాదవశాత్తూ మరణించినా లేదా గాయపడినా బీమా సదుపాయం ఉంటుందని మేము కచ్చితంగా డీలర్లకు వివరిస్తాం. ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలని సూచిస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. వినియోగదారులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిబంధననూ గాలికి వదిలేస్తున్నారు. అయితే ఎవరైనా వచ్చి ప్రమాద ఘటన వివరాలు మా దృష్టికి తెస్తే పరిహారం ఇప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

సీనియర్‌ మేనేజర్, బీపీసీఎల్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top