
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలా
బీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.
నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.
క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్‌లైన్‌లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్‌లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సర్వేయర్‌తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్‌కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.
క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.
Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.