టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

Local Committees Are Appointmented In Mahabubnagar District - Sakshi

త్వరలో గ్రామపంచాయతీల్లోనూ కోఆప్షన్‌ సభ్యుల నియామకం 

ప్రతీగ్రామంలో ముగ్గురి చొప్పున ఎంపిక

సాక్షి, నారాయణపేట: గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడు నెలులు కావస్తుండగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇప్పటికే కొలువుదీరారు. పరిపాలనా సౌలభ్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి జవాబుదారీతనం పెంచడానికి అదనంగా త్వరలో ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మళ్లీ పంచాయతీల్లో కొత్త పదవుల పండుగ వచ్చినట్లయింది. పంచాయతీ బరిలో నిలిచి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కోఆప్షన్‌ పదవిపై ఆశలు పెంచుకున్నారు.

ఉమ్మడి జిల్లాలోని 1,684 పంచాయితీల్లో నియామకం 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 71 మండలాల పరిధిలోని 1,684 గ్రామ పంచాయతీల్లో త్వరలో కోఆప్షన్‌ సభ్యుల నియామకం జరగనుంది. గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యవేక్షణ పెరిగి నిధుల సద్వినియోగం చేసుకోవడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు మున్సిపాలిటీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ కోఆప్షన్‌ సభ్యులు, స్థాయీ సంఘాలను నియమించింది. కొత్త చట్టం ప్రకారం గ్రామ కోఆప్షన్‌ సభ్యులను నియమించాలని అన్ని పంచాయతీలకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు సైతం పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన కాపీలను అధికారులు అందజేశారు.

కో అప్షన్‌సభ్యుల ఎంపిక ఇలా 
సర్పంచ్, ఉప సర్పంచ్‌ వార్డు సభ్యులతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులుంటారు. కొత్త చట్టంలోని 7(3) ప్రకారం గ్రామాభివృద్ధి విషయంలో శ్రద్ధ కలిగిన విశ్రాంత ఉద్యోగి లేదా సీనియర్‌ సిటిజన్‌ మొదటి కోఆప్షన్‌ సభ్యుడిగా, గ్రామంలోని వివిధ సంఘాల అధ్యక్షుల్లో ఒకరిని రెండో కో ఆప్షన్‌ సభ్యుడిగా, గ్రామాభివృద్ధికి విరాళమిచ్చే దాతల్లో ఒకరిని మూడో కో ఆప్షన్‌ సభ్యుడిగా గ్రామ పంచాయతీ నియమిస్తుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి సలహాలు, సూచనలు కో ఆప్షన్‌ సభ్యులు ఇవ్వొచ్చు. మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వీరికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను 5,052 మంది కో ఆప్షన్‌ సభ్యులను నియమించే అవకాశం వచ్చింది.

టీఆర్‌ఎస్‌ శ్రేణులో చిగురించిన ఆశలు 
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం కోఆప్షన్‌ సభ్యులతో పాటు స్థాయీ సంఘాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు మొదలు పెడుతుండడంతో గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకుల్లో పదవుల సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80 శాతం సర్పంచులను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అయితే ఆయా గ్రామాల్లో వార్డుసభ్యులుగా పోటీచేసి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కో ఆప్షన్‌సభ్యులుగా పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు.

స్థాయీ సంఘం కమిటీల నియామకం 
గ్రామాల్లో నాలుగు స్థాయి సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పారిశుద్ధ్యం  నిర్వహణ కమిటీ, రెండోది వీధి దీపాల నిర్వాహణ కమిటీ, మూడోది మొక్కల పెంపకం, నా లుగోది సంతల నిర్వాహణ, పనుల నిర్వాహణ కోసం కమిటీలను వేయనున్నారు. వీటిలో ఒ క్కో సంఘంలో పది మందికి తక్కువ కాకుండా నియమించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క కమిటీకి పది అనుకున్నా 67,360 మందికి అవకాశాలు కల్పించనున్నారు. పది మంది కంటే ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు.

గైడ్‌లేన్స్‌ వచ్చిన తర్వాతే.. 
గ్రామ పంచాయతీలో నూతన చట్టం ప్రకారం కోఆప్షన్‌ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను వేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గైడ్‌లేన్స్‌ రావాల్సి ఉంది. ఈ నెల 3 తర్వాత పూర్తిస్థాయిలో చేసేందుకు అవకాశం ఉంది.  – మురళి, డీపీఓ, నారాయణపేట జిల్లా 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top