స్ట్రెచర్‌పై వైద్యవిద్య

Less Employes In Medicine Colleges In Telangana - Sakshi

అధ్యాపకుల కొరత తీవ్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 925 ఖాళీలు

ప్రొఫెసర్ల కొరతతో నాణ్యత కొరవడిన మెడికల్‌ ఎడ్యుకేషన్‌

దీంతో టాప్‌–100 వైద్య కళాశాలల్లో తెలంగాణకు దక్కని స్థానం

ప్రొఫెసర్ల విరమణతో తగ్గుతున్న పీజీ మెడికల్‌ సీట్ల

రిటైర్మెంట్‌ను 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం

సీనియర్‌ ప్రొఫెసర్లను వదులుకుని.. కాంట్రాక్టు అధ్యాపకులతో క్లాసుల

తెలంగాణ రిటైర్డ్‌ మెడికల్‌ ప్రొఫెసర్లకు మధ్యప్రదేశ్‌ భారీ ఆఫర్‌

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులంతా.. సహజంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనే ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, కాకతీయ తదితర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. వీటిలో చోటు దక్కకపోతేనే ప్రైవేటు కాలేజీలవైపు చూస్తారు. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలవి. అలాగే పీజీ మెడికల్‌ విద్య విషయంలోనూ.. ప్రభుత్వ కాలేజీలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో నాణ్య తపై ఉన్న సందేహాల కారణంగానే.. ప్రభుత్వ వైద్య విద్యే మెరుగన్న భావన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ పట్టభద్రులంటే ఓ గౌరవముంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత తగ్గిపోతోంది. దీనికి కారణం ఈ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రస్థాయిలో ఉండటమే. ఏడాదికేడాది ప్రొఫెసర్ల పదవీ విరమణ జరుగుతున్నప్పటికీ.. దానికి అనుగుణంగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిరాసక్తత చూపడంతో.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యతపై నీలినీడలు అలముకున్నాయి. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్న విమర్శలున్నాయి. దీంతోపాటు బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులు కరువయ్యారు. 

925 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ... 
తెలంగాణలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీలు, వరంగల్లో కాకతీయ మెడికల్‌ కాలేజీ ఉంది. ఆదిలాబాద్‌లో రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లోనూ మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అత్యధికంగా ఉస్మానియాలో 250, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 200 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఏడు మెడికల్‌ కాలేజీల్లో 680 పీజీ మెడికల్‌ స్పెషాలిటీ సీట్లున్నాయి. వచ్చే ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేటల్లోనూ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ఈ కాలేజీలన్నింటికీ అనుబంధంగా బోధనాసుపత్రులున్నాయి. నిత్యం ఆయా బోధనాసుపత్రులకు వేలాది మంది రోగులు వస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ ఆసుపత్రులకైతే జనం పోటెత్తుతారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుంది. నల్లగొండ, సూర్యాపేట కాలేజీలతో మొదలుకొని మిగిలిన ఏడు కాలేజీల్లో ఉండాల్సిన అధ్యాపకులు, వైద్యుల సంఖ్య 2,359 కాగా, కాంట్రాక్టు పద్దతిని తీసుకున్న వారితో కలుపుకొని కేవలం 1,434 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

మొత్తంగా 925 ఖాళీలున్నాయి. ఉదాహరణకు 100 ఎంబీబీఎస్‌ సీట్లున్న ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉండాల్సిన అధ్యాపకుల సంఖ్య 168 మంది కాగా, ప్రస్తుతం అక్కడి స్టాఫ్‌ 49మంది మాత్రమే. ఇంకా 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 100 ఎంబీబీఎస్‌ సీట్లున్న నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో 210 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ.. 102 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 108 ఖాళీలున్నాయి. 150 ఎంబీబీఎస్‌ సీట్లున్న మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 112 మంది అధ్యాపకులకు గానూ.. కేవలం 53 మంది స్టాఫ్‌ ఉన్నారు. ఇక్కడ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో 104 ఖాళీలున్నాయి. ఇలా అన్ని మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో భారీ స్థాయిలో ఖాళీలుండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ఏవేవో సర్దుబాట్లు చేసి లెక్కలు చూపిస్తుంటారు. ఈ ఏడాది ఎంసీఐ నుంచి ఎలాగోలా గట్టెక్కేందుకు కొంత మందిని కాంట్రాక్టు పద్దతిలో నియమించారు. కానీ ప్రొఫెసర్ల కొరత మాత్రం తీర్చలేకపోయారు. ఈ పరిస్థితి వల్ల దేశంలో 100 ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా పోటీలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ఏటా 50 మంది విరమణ... 
ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల కొరతతో రాష్ట్రంలో వైద్యవిద్య నాణ్యత తగ్గుతోంది. పైగా ఆయా బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందడంలేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తుండటం, సకాలంలో పదోన్నతులు చేపట్టకపోవడం, నియామకాలు లేకపోవడం వల్లే అధ్యాపకుల కొరత వేధిస్తుంది. ప్రతీ ఏటా సరాసరి 50 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతేడాది 50 మంది విరమణ పొందగా, అందులో 34 మంది మెడికల్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. దీంతో.. ఎంబీబీఎస్, పీజీ సీట్లలో బోధన చేసేవారే లేరు. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు రిటైర్‌ అయితే.. పీజీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌కు 3 పీజీ మెడికల్‌ సీట్లు, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ఆ ప్రకారం ఫ్యాకల్టీ లేకపోతే ఉన్న సీట్లలో నిస్సందేహంగా కోత విధిస్తారు. ఇలా ఫ్యాకల్టీ తగ్గిపోవడంతో గాంధీ, ఉస్మానియా వంటి మెడికల్‌ కాలేజీల్లోనూ సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి.

నాలుగైదేళ్లలో ఇలా పెద్దసంఖ్యలో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే.. ప్రభుత్వం కలుగజేసుకొని ఎంసీఐ వద్దకు వెళ్లి ఈ ఖాళీలను భర్తీ చేస్తామని బతిమాలుకుని.. మళ్లీ ఆ సీట్లు తెచ్చుకున్నప్పటికీ నియామకాలు మాత్రం జరపలేదు. ఈ ఏడాది 54 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో దాదాపు 100కు పైగా పీజీ మెడికల్‌ సీట్లపై కత్తి వేలాడుతుండటం గమనార్హం. కీలకమైన 35 రకాల విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రమాదంలో పడింది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి బోధనాసుపత్రుల్లో రోగుల సమస్యలపైనా ఈ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది.
 
విరమణ వయస్సు పెంపుపై జాప్యం 
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు. దీంతో వైద్య ప్రొఫెసర్లు 58 ఏళ్లు రాగానే.. రిటైర్‌ అయిపోతున్నారు. వారిని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు లక్షలకు లక్షలు జీతాలిచ్చి నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రం సీనియర్లను వదిలేసుకొని కాంట్రాక్టు పద్దతిలో జూనియర్లను తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. బోధనాసుపత్రుల్లోని అధ్యాపకుల విరమణ వయస్సును 65 ఏళ్లకు పొడిగించాలని గతేడాది రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతో సత్తా ఉన్న వైద్య అధ్యాపకులంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో అధ్యాపకుల విరమణ వయస్సు 65ఏళ్లు కలిపి మరో ఐదేళ్లు పొడిగించారు. అంటే 70 ఏళ్ల వరకు కూడా సీనియర్ల సేవలను వినియోగించుకోనున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం 58 ఏళ్లకే రిటైర్మెంట్‌ కారణంగా వైద్యవిద్య ప్రమాదంలో పడింది. పైపెచ్చు సకాలంలో పదోన్నతులు లేకపోవడంతో.. ప్రొఫెసర్‌ కేడర్‌లోకి రాకుండానే విరమణ పొందుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈసమస్య ఉత్పన్నమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మన వైద్యులకు మధ్యప్రదేశ్‌ వల... 
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, అధ్యాపకుల వేతనాలు చాలా తక్కువ ఉన్నాయన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య సేవల వైపు డాక్టర్లు ఆసక్తి చూపించడంలేదు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్‌ వేతనం అన్నీ అలవెన్సులు కలుపుకొని లక్షన్నర రూపాయలుండగా.. కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు అధ్యాపకుని సామర్థ్యం ఆధారంగా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వేతనం ఇస్తున్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.లక్ష వరకు ఇస్తే, బయట రూ.2 లక్షలు ఇస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.80, 90 వేలు ఇస్తే, బయట రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తున్నారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించింది.

ఆయా కాలేజీలకు అవసరమైన ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపక సిబ్బంది కోసం ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఒక బృందం తెలంగాణకు వచ్చింది. సీనియర్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్ల సంఘాలతోనూ సమావేశమైంది. తమ రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి భారీ వేతనాలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. అలాగే నివసించేందుకు మంచి క్వార్టర్లు ఇస్తామని, భార్యాభర్తల్లో ఎవరైనా అర్హత కలిగినవారు ఉంటే వారికి సరిపోయే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఒప్పుకుంటే తక్షణమే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. అలా వివిధ రాష్ట్రాలు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం సీనియర్లను పోగొట్టుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top