చిక్కని చిరుత   

Leopard In Kamareddy - Sakshi

అడవుల్లో తిండి లేక జనావాసాల్లోకి

శివారు ప్రాంతాల్లో సంచారం

మూగజీవాలపై దాడులు

భయాందోళనకు గురవుతున్న పల్లెలు

కామారెడ్డి క్రైం : గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఇటీవల పెరిగింది. నీళ్లు, ఆహారం కోసం పులులు జనావాసాల్లోకి వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పశువుల పాకల్లోని మూగజీవాలకు రక్షణ లేకుండా పోయింది. చిరుత పులుల దాడుల్లో ఎంతోమంది రైతులు తమ విలువైన పశుసంపదను కోల్పోతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు, ప్రజలు ఒంటరిగా పంటపొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలరోజుల వ్యవధిలోనే ఆరు చోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల ప్రయత్నాలు విఫలం..

పంటపొలాలు, శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్‌ గ్రామాల వెంబడి నెల రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తూ ఆయా గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు వలను ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు.

ఇప్పటికే ఆ చిరుత 20కి పైగా మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా గురువారం, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజులు పిట్లం, జుక్కల్‌ మండలం కోరన్‌పల్లి తండా శివారులోని పశువుల పాకమీద ఓ చిరుత దాడి చేసింది. ఈ దాడిలో మూడు దూడలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో దూడకు తీవ్రంగా గాయాలయ్యాయి. చిరుత దాడి విషయం తెలియగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. మూడు నెలల క్రితం ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా, తిమ్మాపూర్‌ గ్రామాల శివారు ప్రాంతాల్లో సంచరించిన ఓ చిరుత హల్‌చల్‌ చేసింది.

అటవీ అధికారులు, గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. రెండు రోజులపాటు ఉరుకులు పరుగులు పెట్టించిన ఆ చిరుత చివరికి మృతి చెంది లభించింది. అప్పటికే ఆయా గ్రామాల పరిధిలో రెండుచోట్ల దాడులు చేసి దూడలు, గొర్రెలను హతమార్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు చిరుత పులులు దాడులు చేసిన ఘటనలన్నీ దాదాపుగా వేకువజాము సమయంలోనే జరిగినట్లు బాధితులు, అటవీ అధికారులు భావిస్తున్నారు. 

చిరుతల పరిస్థితీ దయనీయమే.. 

ఉమ్మడి జిల్లాలో పులుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. మనిషి స్వార్థానికి అడవులు లేకుండాపోతున్నాయి. అడవిలో తిండి దొరక్క ఆహారం కోసం గ్రామాల మీదపడి పశువులు, మేకలను హతమారుస్తున్నాయి. రైతులు తమ పశుసంపదను కోల్పోయి రూ.వేలల్లో నష్టాలకు గురవుతున్నారు. వాస్తవానికి అటవీ ప్రాంతాల్లో వన్యమృగాలకు ఏ మాత్రం ఆహారం గానీ, నీళ్లు గానీ దొరకడం లేదు. వన్య ప్రాణులు జనావాసాల్లోకి ఇస్తున్నాయంటే అది కొందరు స్వార్థ పరుల పుణ్యమేనని చెప్పవచ్చు.

యథేచ్ఛగా అడవులను ఆక్రమిస్తూ వన్యప్రాణుల మనుగడకు ఆటంకాలు కలిగించడం ప్రధాన కారణమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు అటవీశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గత కొద్ది కాలంలోనే ఉమ్మడి జిల్లాలో నాలుగు చిరుత పులులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడ్డాయి. ఏది ఏమైనా చిరుత పులులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీశాఖ, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top