జీపీఎస్‌ విధానంతో భూసర్వే

Land Survey With GPS Policy - Sakshi

ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ కిషన్‌రావు

శివ్వంపేట(నర్సాపూర్‌) : జిల్లాలో పార్ట్‌ బీలో ఉంచిన భూ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ కిషన్‌రావు అన్నారు. శుక్రవారం జేసీ నగేశ్‌తో కలిసి శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయ రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 315, 316లో జరుగుతున్న భూసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సంబంధించి భూముల వివరాలు పార్ట్‌ బీలో ఉంచామని, ఇప్పటి వరకు 30 వేల ఎకరాలు ఫార్ట్‌ ఏలోకి మార్చినట్లు చెప్పారు. మిగతా భూ సమస్యలను సైతం పరిష్కరించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా శివ్వంపేట మండలంలో భూ సమస్యలు అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

గతంలో పనిచేసిన సిబ్బంది చేసిన తప్పుల మూలంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. మండలంలో 48 వేల 327 ఎకరాల భూములు ఉండగా 11వేల376 ఎకరాల విస్తీర్ణం రికార్డుల్లో పెరిగిందన్నారు. భూ విస్తీర్ణం పెరిగిన సర్వేనంబర్లలో  సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు సర్వే బృందాలు ఉండగా మారో మూడు బృందాలను పంపిస్తామని చెప్పారు. జీపీఎస్‌ విధానం ద్వారా త్వరగా సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సర్వే అనంతరం రైతులకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం, రైతుబీమా బాండ్లు ఇస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్‌ ఆర్‌డీఓ నగేశ్‌ తహసీల్దార్‌ భానుప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top