త్రీడీతో డిజిటల్‌ విప్లవం

KTR calls For High Digital Adoption In Govt - Sakshi

సామాన్యులకూ డిజిటల్‌ పరిజ్ఞానం

సీఐఐ డిజిటల్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో డిజిటల్‌ అక్షరాస్యత, మౌలిక వసతులు, ఆవిష్కరణల (త్రీడీ) ద్వారానే భారత్‌లో డిజిటల్‌ విప్లవం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సామాన్యులకు కూడా డిజిటల్‌ పరిజ్ఞానం అందినప్పుడే డిజిటల్‌ విప్లవం సాధ్యమవుతుందని అప్పుడే సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘కోవిడ్‌ తదనంతర కాలంలో డిజిటల్‌ విప్లవం’అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నిర్వహించిన డిజిటల్‌ సదస్సుకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆన్‌లైన్‌ వేదికగా ‘వర్చువల్‌ కాన్ఫరెన్స్‌’విధానంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంచేందుకు భారత్‌లో ఎంతో కృషి జరగాల్సి ఉందని, అందుకు అవసరమైన బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన, ఆవిష్కరణలు జరగాల్సి ఉందన్నారు. భారతీయ డిజిటల్‌ వ్యూహంలో భాగంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 


ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో తెలంగాణ 
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 18% వృద్ధి రేటును సాధించడాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ సాహ్నీ అభినందించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలో రాష్ట్రంలోని వేయికి పైగా కిరాణా దుకాణాలను డిజిటల్‌ వేదికపైకి తీసుకువచ్చిన తీరును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వివరించారు. భారతదేశం డిజిటల్‌ పరివర్తన చెందేందుకు కోవిడ్‌ మహమ్మారి ఊతమిచ్చిందన్నారు. ఐటీ రంగంలో నాణ్యతను పెంచేందుకు ఇప్పటికే 21 చోట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు (సీఓఈ) ఏర్పాటు చేయగా, మరో 12 సీఓఈల ఏర్పాటుకు ద్వితీయ శ్రేణి నగరాలను గుర్తించినట్లు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌రాయ్‌ వెల్లడించారు. సదస్సులో సీఐఐ తెలంగాణ మాజీ చైర్మన్‌ వి.రాజన్న, ఎంపీఎల్‌ సీఈఓ సాయి శ్రీనివాస్‌ కిరణ్, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ క్రిష్ణ బోదనపు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top