పోటెత్తుతున్న కృష్ణా

Krishna River Gets Huge Water Due To Heavy Rain At West Side - Sakshi

పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలు

ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి 1.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో కృష్ణా నది మళ్లీ పోటెత్తుతోంది. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండటంతో వచి్చన నీటిని వచి్చనట్లుగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి  1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది.  76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డు లు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి.

శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో 2009–10లో 1,218 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం ఏకంగా 1,420 టీఎంసీల మేర వరద వచి్చంది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది.

అప్రమత్తంగా ఉండాలి:   కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top