కొండగట్టు బాధితులు ఇంటికి వెళ్లొచ్చు!

Kondagattu Bus Accident victims can go home says Hospital Officials - Sakshi

     బంధువులకు చెప్పిన ఆస్పత్రి వర్గాలు 

     స్పృహలోకి వచ్చిన ముగ్గురు, కోమాలోనే మరొకరు 

     చెకప్‌కు హైదరాబాద్‌ తీసుకొచ్చే స్తోమత లేదన్న బంధువులు

సాక్షి, హైదరాబాద్‌:  కొండగట్టు ఆర్టీసీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. గాయపడ్డవారిలో నలుగురు ఇంటికి వెళ్లొచ్చని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హైదరాబాద్‌కు క్రమం తప్పకుండా వైద్యపరీక్షల కోసం తీసుకురావాలని డాక్టర్లు సూచించారు. చేతిలో చిల్లిగవ్వలేని కూలీ కుటుంబాలమైన తమకు అదెలా సాధ్యమంటూ వాపోతున్నారు. 62 మంది ప్రయాణికు లను బలితీసుకున్న ఆ దుర్ఘటన నుంచి క్షతగాత్రులు, మృతుల కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. సెప్టెంబర్‌ 11న బస్సు ప్రమాదం జరిగాక రాజమ్మ, సత్తవ్వ, విజయ, రాజయ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో సన్‌షైన్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కళ్లు తెరిచిన విజయ, సత్తవ్వలను శనివారం జనరల్‌ వార్డుకు మార్చనున్నారు. రాజవ్వ శుక్రవారం స్పృహలోకి వచ్చింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య మాత్రం ఇంకా కోమాలోనే ఉన్నాడు. వీరంతా ఇంకా కొన్ని నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. ఈ నలుగురూ రోజువారీ కూలీలు. మందులు, రెగ్యులర్‌ చెకప్‌లకు హైదరాబాద్‌కు ఎలా రావాలా? అని ఆందోళన చెందుతున్నారు. 18 రోజులుగా హైదరాబాద్‌లో ఉండటానికి భోజనం ఖర్చులకే అప్పు చేశామని, భవిష్యత్తులో చికిత్స, మందులు తమకు తలకుమించిన భారమని వాపోతున్నారు. 

ఏర్పాట్లు చేస్తున్నాం 
కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. డిశ్చార్జ్‌ అయినవారికి మేమే అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తాం. వారిని ఇంటి వద్ద దించేదాకా మాదే బాధ్యత. డిశ్చార్జి అయిన క్షతగాత్రులకు జగిత్యాలలో రెగ్యులర్‌ చెకప్‌ల కోసం ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడాం. వారి చికిత్స విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
 – జీవన్‌ ప్రసాద్, ఆర్‌ఎం, కరీంనగర్‌

దుబాయ్‌లో ఉద్యోగం మానేసి వచ్చాను 
మా అమ్మ మెల్లిగా కోలుకుంటోంది. గర్భవతి అయిన నా సోదరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా చెల్లి చనిపోయింది. ఆ విషయం ఇప్పటికీ మా అమ్మకు చెప్పలేదు. విషయం తెలిసి దుబాయ్‌ నుంచి వచ్చేశాను. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. డాక్టర్లు చెకప్‌ల కోసం హైదరాబాద్‌కు తీసుకురమ్మంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. దయచేసి జగిత్యాల లేదా కరీంనగర్‌లో మాకు చికిత్స అందించే ఏర్పాటు చేయండి. 
 – అనిల్, విజయ కుమారుడు, తిమ్మాయపల్లి 

తలకు మించిన భారం 
నేను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తాను. సెలవుల కోసం వచ్చినపుడు ఈ దుర్ఘటన జరిగింది. ఇక అప్పటి నుంచి నేను దుబాయ్‌ వెళ్లలేదు. అమ్మ ఈ రోజే కళ్లు తెరిచింది. నన్ను గుర్తుపట్టింది. అదే సమయంలో డాక్టర్లు మరో రెండురోజుల్లో పంపిస్తామని చెప్పారు. దీంతో ఇంటికెళ్లాక అమ్మను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. మా వద్ద సదుపాయాలు లేవు. దయచేసి అమ్మ పూర్తిగా కోలుకోనేదాకా చికిత్స ఇప్పించాలని మనవి.
– సాయి, రాజవ్వ కుమారుడు, జగిత్యాల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top