
మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని...
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యలపై ముఖ్యమంత్రితో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికి తనను ఆయన ఇంటికి ఆహ్వానించారని కోమటిరెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో కేసీఆర్‌తో మరోసారి ప్రత్యేకంగా సమావేశమవుతానని అన్నారు.
సీఎం కేసీఆర్ ఈ ఉదయం యాదాద్రిలో పర్యటించి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం యాదాద్రి పనుల పురోగతిపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, టెంపుల్ సిటీ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. కాగా యాదాద్రిలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో యాగం నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామితో ఆయన చర్చించిన సంగతి తెలిసిందే.