ప్రభుత్వ బాధ్యత మరిచింది..

Kodandaram Telangana Jana Samithi Meeting In Mahabubnagar District - Sakshi

స్థూపం నిర్మాణానికి ఒక్కో ఇనుప ముక్క తేవాలి

టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం 

తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయం ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : నాయకులు పదవుల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేసి తర్వాత దాని విలువలు మర్చారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కొదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ఆయన బుధవారం మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రిబ్బన్‌కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, కనీస బాధ్యతలను ప్రభుత్వాలు మరిచి, పూర్తిగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా సభలు ఏర్పాటు చేసుకోవడమనేది రాజ్యాంగ హక్కు, ఇందుకు 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా.. అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అయితే జన సమితి సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయం పట్టకుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదన్నారు.

పార్టీ ఇలా ప్రారంభం నుంచి పోరాటాలతోనే ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను మాత్రమే మాట్లాడామన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఎన్నో త్యాగాలు చేసి కుర్చీ అప్పజెప్పారు.. మా ఇష్టం వచ్చినట్లు పాలిస్తామన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ఊరికే రాలేదు.. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయితే వచ్చింది.. వారిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ఒక స్థూపం కూడా నిర్మించకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ నెల 29న హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే సభకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక ఇనుప ముక్కను వెంట తీసుకురావాలని, తెచ్చిన ముక్కను కరగదీసి అక్కడే అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

కాంట్రాక్టులు, పైరవీల కోసమే రాజకీయాలు 
ఎన్నో ఏళ్ల తర్వాత కనీస న్యాయం జరుగుతుందని కళలుగన్న తెలంగాణ ప్రజలకు నాయకులు కనీస న్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు. కాగా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసమే కుర్చీలు ఎక్కారని, ఎక్కడ భూ సెటిల్‌మెంట్‌లు చేయవచ్చు అనుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌లో బాలికలపై జరిగిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. శ్రీరెడ్డి అనే నటికి అవకాశాలు ఇవ్వకుండా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండక.. బోర్లు ఎండిపోయి.. వడగండ్ల వానపడి వేల ఎకరాళ్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం చూపిన తెగువ ఇక్కడి ప్రజలు మరిచి పోలేదని, అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్నామ్నాయ పార్టీలు అవసరమని, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది ముందే తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఒకేఒక్క కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీజేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, నాయకులు బాల్‌కిషన్, మంత్రి నర్సింహయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top