అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది..? ప్రజాబలం ఉన్న నేతలకే ఇస్తారా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రథసార«థి బాధ్యతలు కట్టబెడతారా..? లేక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు బేగ్‌నే ఈ పదవిలో కొనసాగిస్తారా..? అన్న దానిపై టీఆర్‌ఎస్‌లో చర్చసాగుతోంది.
► బేగ్‌కు నామినేటెడ్ పోస్టుతో ఆశావహుల ఎదురుచూపు
► ప్రజాబలం ఉన్న నేతలకే ఇవ్వాలని ఆ పార్టీలో చర్చ
► వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు
సాక్షి, ఖమ్మం:
అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది..? ప్రజాబలం ఉన్న నేతలకే ఇస్తారా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రథసార«థి బాధ్యతలు కట్టబెడతారా..? లేక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు బేగ్‌నే ఈ పదవిలో కొనసాగిస్తారా..? అన్న దానిపై టీఆర్‌ఎస్‌లో చర్చసాగుతోంది.
ఒకవేళ బేగ్‌ను మారిస్తే ఎవరిని జిల్లా అధ్యక్షుడిని చేయాలనే దానిపై ఆపార్టీ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో పార్టీ పదవుల విషయంలో జిల్లాలో పోటీనే లేదు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఆపార్టీకి ఇక్కడ తగిన బలం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. తాము టీఆర్‌ఎస్‌లో చేరకముందు ఇతర పార్టీల్లో ప్రాముఖ్యత ఉన్న పదవుల్లో కొనసాగామని, పార్టీ పదవి లేకపోతే నామినేటెడ్ పోస్టు అయినా ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో చేరికల సమయంలోనే హామీలు తీసుకున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కింది. అదేవిధంగా జిల్లాలోనూ పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు భర్తీ చేయడంతో పదవుల కోలాహలం నెలకొంది. ఇంకా జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు త్వరలో భర్తీ చేస్తామన్న ఆపార్టీ నేతల ప్రకటనలతో.. ఈపదవులు తమకు దక్కవని నిరాశతో ఉన్నవారు కనీసం జిల్లా, మండల స్థాయిలో పార్టీ పదవులు దక్కుతాయోనన్న ఆశలో ఉన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బుడాన్‌బేగ్‌ను ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడంతో.. జిల్లా పార్టీ అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందని ఆపార్టీలోని కొంతమంది నేతలు ధీమాగా ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశీస్సులు తమకంటే తమకే ఉన్నాయని, పార్టీ అధ్యక్ష పదవి నియామకం చేపడితే ..తమకు పదవి ఖాయమేనని ఆశావహులు భావిస్తున్నారు. జిల్లా పార్టీని నడిపించే సత్తా ఎవరికి ఉంది..? ఫలానా నేత అయితే ఎలా ఉంటుంది, ప్రజాబలం ఎవరికి ఉంది..? అన్న కోణంలో పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికలను కీలకంగా తీసుకొని..
2019లో వచ్చే సార్వత్రిక ఎన్నికలను కీలకంగా తీసుకొని పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలు చేపడతామని కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించారు. అయితే బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో మిగతా జిల్లాల మాదిరిగానే జిల్లాకు కూడా కొత్త రథసారథి కోసం అన్వేషణను రాష్ట్ర నేతలు ప్రారంభించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కేడర్ జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకే నడవాలంటే బలమైన నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నారు. బేగ్‌ను కొంతకాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తారా..? లేక కొత్త వారికి సారథ్య బాధ్యతలపై పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటదోనని ఆశావహులు ఎదురుచూస్తున్నా రు. బేగ్‌కు నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో పార్టీ అధ్యక్ష పీఠం మార్పు ఖాయమని అనుకుంటు న్న వారు మాత్రం జిల్లాతో పాటు రాష్ట్ర నేతలు, మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు.