ప్రాణహితనా.. వార్ధానా?

KCR command to study once again on the construction of the tummidihatti barrage - Sakshi

తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మరోసారి అధ్యయనానికి సీఎం ఆదేశం

ప్రాణహితపై అయితే 6.45 కి.మీ బ్యారేజీ, 107 గేట్లు

వార్ధాపై అయితే కిలోమీటర్‌ బ్యారేజీ, 28 గేట్లు

నీటి లభ్యత, వరద ఉండే కాలం ఆధారంగా నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా పక్కన పెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని ఏ నదిపై నిర్మించాలన్న తర్జన భర్జన మొదలైంది. వెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా, కొత్తగా కేవలం వార్ధా నదిపై వీర్దండ వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనపైనా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాకు మేలు చేస్తుందో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. 

ఇప్పుడైనా తేలుతుందా..
వెయిన్‌గంగ, వార్ధా నదులు కలిసిన అనంతరం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించడం ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని 2004లో నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బ్యారేజీలో రీడిజైన్‌ తర్వాత జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ.639 కోట్లతో అంచనా వేశారు. వన్యప్రాణి సంరక్షణ కారణంగా ప్రాణహిత నదిపైనే ఒకటిన్నర కిలోమీటర్‌ ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చడంతో అంచనా వ్యయం రూ.1,918.70 కోట్లకు చేరింది. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్ర లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాల ముంపు, ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణం గత ఐదేళ్లుగా జరగకపోవడంతో ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనా వ్యయం రూ.1,918.70 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరుతోంది. 

పునరాలోచనలో ప్రభుత్వం...
బ్యారేజీ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్ధాపై నిర్మాణంతో కేవలం కిలోమీటర్‌ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 28 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ.700 కోట్లు దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు సరిపోతాయని లెక్క గట్టాయి. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్షించిన సీఎం గత ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వార్ధా వద్ద నీటి లభ్యత ఉన్నా అది తక్కువ సమయంలోనే భారీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బ్యారేజీ సామర్థ్యం 1.5 టీఎంసీలే కావడంతో అంత తక్కువ సమయంలో నిర్ణీత 20 టీఎంసీలు మళ్లించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని సమీక్ష సందర్భంగా ఇంజనీర్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, లభ్యత కాలం, మళ్లింపు అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పెద్దవాగులో సైతం 16 నుంచి 18 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఆ నీటిని కాళేశ్వరంలో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు ఎలా తరలించాలన్న దానిపైనా పరిశీలన చేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top