పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా: కవిత

Kavitha Respond On Election Results - Sakshi

ప్రజాస్వామ్యంలోగెలుపు, ఓటములు సహజం మాజీ ఎంపీ కవిత

చంద్రశేఖర్‌కాలనీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్‌ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్‌ కుటుంబ సభ్యులకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడటం లేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడుతుందని అన్నారు.

పదవి ఉన్నా, లేకున్నా తాను నిజామాబాద్‌ను వదిలిపెట్టిపోనని, ప్రజల సమస్యల పరిష్కారంలో, జిల్లా అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘హుం దాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం’అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్‌ ఎమ్మె ల్యే బిగాల గణేశ్‌గుప్తా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్‌ నగర మాజీ మేయర్‌ డి.సంజయ్, డి.రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఆమె వెంట ఉన్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
కార్యకర్త కిషోర్‌ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top