క్యాంటీన్‌పై కన్ను!

Karimnagar Government Hospital To Get A Facelift Karimnagar - Sakshi

కరీంనగర్‌హెల్త్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన ఆహార పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. రోగులతోపాటు వారి బంధువులకు నాణ్యమైన భోజనం, బ్రెడ్, పాలు సరసమైన ధరలకు అందించడమే క్యాంటీన్‌ ఉద్దేశం. అయితే ఈ క్యాంటీన్‌ నిర్వహణను టెండర్లు పిలవకుండానే అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అతి పెద్ద ఆస్పత్రి కావడంతో రోజుకు వేయి మంది వరకు వస్తుండడంతో అందరి కళ్లు ఈ క్యాంటీన్‌పైనే పడ్డాయి.

తమ అనుయాయులకే ఇప్పించుకునేందుకు గళ్లీస్థాయి లీడర్ల నుంచి మంత్రిస్థాయి ప్రజాప్రతినిధుల వరకు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తామేమి తక్కువ తిన్నామా అన్నట్లు ఆస్పత్రిలోని వైద్యులు సైతం తమ వారికి క్యాంటీన్‌ దక్కేలా యత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని మాత్రమే ఆస్పత్రి స్టాండింగ్‌ కమిటీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. క్యాంటీన్‌ నిర్వహణను ఎలా అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా ఆస్పత్రి పాతభవనంలో ఓ క్యాంటీన్‌ ఉండగా.. మరొకటి ఎందుకనే ప్రశ్న వస్తుంది. క్యాంటీన్‌ కోసం ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
 
లాభాల కోసమే..
మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు నాణ్యమైన పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇదీ సేవ మాదిరిగానే చూడాలని వ్యాపార కోణంలో ఆలోచించవద్దని స్థానికులు కోరుతున్నారు. గత వారం నిర్వహించిన ఆస్పత్రి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో క్యాంటీన్‌ గురించి చర్చించకపోయినప్పటికీ.. పైరవీలు జోరందుకున్నట్లు చర్చ సాగుతోంది. వికలాంగులు, నిరుద్యోగ యువతకు ఇచ్చి నిర్వహణను మెరుగ్గా ఉండేలా చూడాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు.
 
క్యాంటీన్‌ లేక ఇబ్బందులు
మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది గడిచిపోయింది. అప్పటి నుంచి క్యాంటీన్‌ లేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో రాత్రి, పగలు తేడాలేకుండా గర్భిణులు, బాలింతలు నెలల శిశువులతో ఆస్పత్రిలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రతీ రోజు 20కి తగ్గకుండా ప్రసవాలు జరుగుతుండగా, 30 నుంచి 40 మంది వరకు బాలింతలు, శిశువులు వైద్యసేవల కోసం ఆస్పత్రిలో చేరుతుంటారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగులకు పాలు, టీ, కాఫీ, బ్రెడ్, బిస్కట్‌తోపాటు పండ్ల రసాలు అందించాల్సి ఉంటుంది. కప్పు పాల కోసం  రోగుల బంధువులు చాలా దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పాల కోసం బస్టాండ్‌కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని, అక్కడి నుంచి తెచ్చుకునే క్రమంలో పాలకు రూ.10, ఆటోచార్జీలు రూ.50 ఖర్చు అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారుల దోపిడీ
పాలు, చాయ్, బ్రెడ్‌ వంటి పదార్థాల కోసం బయటికి వెళ్తే షాపుల నిర్వాహకులు దోపడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఆహార పదార్థాలు, పాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని రోగులు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్యాంటీన్‌ నిర్వహణను లాభార్జనతో కాకుండా సేవాభావంతో చూసే వారికి అప్పగించాలని డిమాండస్థానికంగా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top