త్వరలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు

Kaleshwaram Water Comes To Sri Ram Sagar Project - Sakshi

సీఎం ఆదేశాలతో ‘పునరుజ్జీవనం’లో వేగం

రోజుకు అర టీఎంసీ చొప్పున తరలింపునకు చర్యలు 

ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆయకట్టు వెతలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీకి చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించడంతో.. పునరుజ్జీవన పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఆదేశాలతో ఈ సీజన్‌లోనే తమ పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టారు. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్‌ పంపింగ్‌ చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద గల మూడో పంపు హౌజ్‌ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండు పంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది.

ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. పనులను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేకపోవడంతో 0.5 టీఎంసీల చొప్పున నీటిని ముందుగా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తరలించే పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ నెల 15 లోపు ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి.

వరద కాలువలో ఏడాదంతా నీరు..
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువలో నీరు రివర్స్‌ పంపింగ్‌ చేయడంతో వరద కాలువలో ఏడాదంతా నీరు నిల్వ ఉంటుంది. దీంతో వరద కాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగే అవకాశాలున్నాయి. రైతులకు ఈ నీటితో కొంత ఉప శమనం కలుగనుంది.

ఆయకట్టు రైతుల్లో ఆనందం..
సీఎం ఆదేశాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సంవత్సరం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్‌లో నీరు లేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది రైతులు ఖరీఫ్‌ పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. కానీ సీఎం ఆదేశాలతో ఈనెల 15వ తేదీలోపు కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని చేరితే తమ పంటలకు ఢోకా ఉండదని రైతులు అంటున్నారు. 
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top