జూరాలకు బిరబిరా

Jurala Barrage Is Getting Huge Inflow From Upper Krishna - Sakshi

ఎగువ నుంచి భారీగా కృష్ణా వరద

నారాయణపూర్‌ నుంచి జూరాలకు 1.46 లక్షల క్యూసెక్కులు

పది రోజులపాటు ప్రవాహాలు కొనసాగొచ్చు: కేంద్ర జల సంఘం

ఆల్మట్టికి పెరుగుతున్న ప్రవాహం

నిండుకుండలా తుంగభద్ర.. 12 గేట్లు ఎత్తివేత.. శుక్రవారం శ్రీశైలానికి

సాక్షి, హైదరాబాద్ ‌: ఎగువన గత పదిహేను రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కర్ణాటకలోని కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. గతేడాదితో పోలిస్తే నెలన్నర ముందుగానే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలు నిండటంతో జూరాల వైపు కృష్ణమ్మ ఉరకలేస్తూ వస్తోంది. నారాయణపూర్‌ నుంచే 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

గురువారం ఏ క్షణంలో అయినా ఆ ప్రవాహాలు జూరాలను చేరనున్నాయి. 10 టీఎంసీలకు మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో గురువారం సాయంత్రానికే జూరాల గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రమే తుంగభద్ర 12 గేట్లు ఎత్తడంతో అక్కడ్నుంచి కూడా శ్రీశైలానికి భారీ వరద రానుంది.

ప్రాజెక్టులన్నీ నింపేస్తూ..
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉరకలేస్తోంది. రెండ్రోజుల కిందట ఇక్కడ ఏకంగా 35 సెం.మీ. వర్షం కురవగా.. బుధవారం 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో దిగువ కర్ణాటకకు ఉధృతంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఈ ప్రవాహాలకు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం సాయంత్రానికి 1.53 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ప్రాజెక్టులో ఇప్పటికే 129 టీఎంసీల నిల్వలకు గానూ 113.4 టీఎంసీల నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు.

ఇప్పటికే నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు 33 టీఎంసీలు ఉండటంతో 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు. 10 టీఎంసీల మేర వరద వస్తుండటం, ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో 5.73 టీఎంసీల నీరు ఉండటంతో గురువారం రాత్రి జూరాల గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. మరోవైపు తుంగభద్ర కూడా నిండుకుండను తలపిస్తోంది. ఇక్కడ 100 టీఎంసీలకుగాను 91.59 టీఎంసీల నిల్వ ఉంది. 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో బుధవారం సాయంత్రం తుంగభద్ర గేట్లు ఎత్తారు. దీంతో 65 వేల క్యూసెక్కుల మేర వరద శ్రీశైలం దిశగా వస్తోంది.

అక్కడ్నుంచి శ్రీశైలానికి నీరు చేరేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, ఈ లెక్కన శుక్రవారం సాయంత్రానికి వరద వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో తెలంగాణను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. మరో 15 రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉన్నందున వరద నియంత్రణ చర్యలు తీసుకోవాలని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల అధికారులకు సూచించింది. ఇక ఇప్పటికే జూరాల పరిధిలోని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ పంపులను ఆరంభించగా.. శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి ద్వారా కూడా నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top