అక్కడా.. ఇక్కడా కుదరదు

JNTU Ask Teaching Staff List to Engineering Colleges - Sakshi

బోధనా సిబ్బంది వివరాలను ఇవ్వండి

అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఈ నెల 31 డెడ్‌లైన్‌

శుక్రవారం వరకు 83,543 మంది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

సాక్షి, సిటీబ్యూరో:  అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వివరాలను జేఎన్టీయూహెచ్‌కు ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం అనుబంధ కళాశాలలు ఆయా పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను జేఎన్టీయూహెచ్‌కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. తరగతులు ప్రారంభమై 20 రోజులకు పైగా గడుస్తుండటంతో ఇప్పటికీ వివరాలను ఇవ్వని కళాశాలలకు ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. 

రిజిస్ట్రేషన్‌ ఐడీ తప్పనిసరి..
ప్రతి కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బంది తమ అర్హతలు, అనుభవం, పనిచేసే కాలేజీ, అందులో చేరిన రోజు, లేటెస్ట్‌ ఫొటో తదితర అన్ని విషయాలను వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫ్యాకల్టీకి ఒక ఐడీ నెంబర్‌ను ఇస్తారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు దరఖాస్తుచేసుకునే సమయంలోనే జేఎన్టీయూహెచ్‌కు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్‌ ఐడీని అందజేయాల్సి ఉంటుంది. శుక్రవారం వరకు జేఎన్టీయూహెచ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు 83, 543 మంది ఉన్నారు.

గతంలో ఈ విధానం లేకపోవడంతో..
2015 సంవత్సరానికి ముందు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్‌ విధానం లేకపోవడంతో చాలా వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలు వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇష్టం లేక మొక్కుబడిగా అధ్యాపకులను నియమించుకునే వారు. ఒక్కరే అధ్యాపకులు ఐదు, ఆరు కళాశాలల్లో కూడా పనిచేసే వారు. ఈ విధానానికి చెక్‌ పెట్టేందుకు జేఎన్టీయూహెచ్‌ ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి అధ్యాపకుడి నుంచి పాన్‌కార్డు, ఆధార్‌ కార్డును ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కరే అధ్యాపకులు పలు కళాశాలల్లో పనిచేసే విధానం పోయింది. దీనికి తోడు బీటెక్‌ స్థాయి విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు ఎంటెక్‌ విద్యార్హత తప్పనిసరి అయినా బీటెక్‌లతోనే నెట్టుకు వస్తుండటంతో ఈ పోర్టల్‌లో ఎంటెక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీంతో ఎంటెక్‌ పూర్తి చేసిన వారినే కళాశాలలు అధ్యాపకులుగా నియమించుకుంటున్నారు. అంతేగాకుండా బోధనా సిబ్బంది తాము పనిచేస్తున్న కళాశాలను మారాల్సి వచ్చినా ముందుగానే సంబంధిత కళాశాలకు తెలిపి రిలీవింగ్‌ లెటర్‌ తీసుకుని ఇతర కళాశాలకు మారాల్సి ఉంది.

అవకతవకలకుఅవకాశమే లేదు
ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించాక అవకతవకలకు అవకాశమే లేదు. ప్రతి సంవత్సరం జేఎన్టీయూహెచ్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలు అప్లియేషన్‌ పోర్టల్‌లో ప్రస్తుత ఫ్యాకల్టీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎంత మంది ఫ్యాకల్టీని చేర్చుకున్నారు, ఎంత మందిని తొలగించారు అనే వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంది.  – ఎన్‌.యాదయ్య,జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top