మో‘డిమ్‌’ జిమ్స్‌!

Jim Coach Shortage in hyderabad - Sakshi

ఎవరికీ పట్టని మోడర్న్‌ జిమ్స్‌  

అంతటా నిర్వహణలేమి తుప్పుపట్టిన పరికరాలు   

మరికొన్ని కనిపించని వైనం  

రూ.12 కోట్లు వృథాకోచ్‌లూ లేరు..

సమయపాలనా లేదు

సాక్షి నెట్‌వర్క్‌: ఖరీదైన జిమ్‌ సెంటర్లకు వెళ్లిలేని వారికోసం జీహెచ్‌ఎంసీ మంచి ఆశయంతో ప్రారంభించిన  మోడర్న్‌ జిమ్‌లు ఆలనాపాలనా లేక అధ్వానంగా మారాయి. పట్టించుకునే నాథుడు లేక కోట్ల రూపాయల విలువైన పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. కనీస నిర్వహణకు నోచుకోక, ఆసక్తి ఉన్న వారికి ఉపకరించక కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. మొత్తం జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో 150 జిమ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నారు. 135 జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్‌కు దాదాపు రూ.4లక్షల వంతున దాదాపు రూ.5.50 కోట్లు ఖర్చు చేశారు. అంతే కాకుండా వీటిని ఏర్పాటు చేసే హాళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఆయా కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.5 లక్షల వంతున దాదాపు మరో రూ.7కోట్లు వెరసి జిమ్‌ల పేరిట దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ఆధునిక జిమ్‌లు బస్తీల్లోని యువతకు ఉపకరిస్తాయని ఏర్పాటు చేసినప్పటికీ, కొద్దికాలం బాగానే పని చేసిన తర్వాత అవి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి. 2016లో ఏర్పాటు చేసిన ఈ జిమ్‌లు దాదాపు ఏడాదిన్నర కాలానికే ఆనవాళ్లు లేకుండాపోయాయి.

చాలా వాటిల్లో పరికరాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల పరికరాలు స్థానిక నేతల ఇళ్లకు చేరాయి. ఇంకొన్ని చోట్ల అసలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్వల్ప మరమ్మతులు చేసేవారు సైతం లేక కొన్ని మూలనపడ్డాయి. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జిమ్‌లు పనికిరాకుండా పోయాయి. జిమ్‌లలో ట్రైనర్లు లేకపోవడంతోనూ వీటి ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. ఇక కొన్ని ఎప్పుడు ఓపెన్‌ చేస్తున్నారో, ఎప్పుడు మూసేస్తున్నారో తెలియని దుస్థితి. దూరప్రాంతాలకు వెళ్లలేని మహిళలకు ఈ జిమ్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయని భావించినా అమలుకు నోచుకోలేదు. జిమ్‌లలో ఉచిత వైఫై సదుపాయాన్ని సైతం కల్పిస్తామని ప్రకటించినప్పటికీ తాగునీరు, టాయ్‌లెట్ల వంటి కనీస సదుపాయాల్లేవు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తప్ప వాటిని పట్టించుకుంటున్నవారు లేరు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసుకోవాలని కాలనీ సంఘాలకు సూచించినా, అసలు పట్టించుకునేవారు లేక చాలాచోట్ల వెలవెలబోతున్నాయి. కొన్ని సెంటర్లలో నాసిరకం పరికరాలు  ఉంచారనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల నాణ్యమైనవి ఇతర ప్రాంతాలకు తరలించారనే విమర్శలున్నాయి. కోట్లు వెచ్చించిన జీహెచ్‌ఎంసీ నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన జిమ్‌సెంటర్ల దుస్థితిపై  ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన.. 

పరికరాలు మాయం..
ఒక్కో జిమ్‌లో అత్యంత ఆధునిక సైక్లింగ్, త్రెడ్‌మిల్, ప్లేట్‌స్టాండ్, త్రిస్టర్, డంబెల్స్‌ సదుపాయాలతో సహా మొత్తం  21 పరికరాలను ఉంచినట్లు పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో సీతాఫల్‌మండి ఇందిరానగర్, తార్నాక, మాణికేశ్వర్‌నగర్, మెట్టుగూడ, బౌద్ధనగర్‌లలోని జిమ్‌లకు నెలల తరబడి తాళాలు వేసి ఉండడంతో పాటు శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో జిమ్‌కు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని వ్యాయామ పరికరాలు విరిగిపోగా, మరికొన్ని తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయి. జీడిమెట్ల డివిజన్‌ శ్రీనివాస్‌నగర్‌లోని జిమ్‌ పరికరాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధి అంబేడ్కర్‌నగర్‌ కమిటీ హాల్‌లోని జిమ్‌ ఎక్కడికి తరలిపోయిందో తెలియని పరిస్ధితి. జగద్గిరిగుట్ట డివిజన్‌ జగద్గిరినగర్‌లో, సూరారం డివిజన్‌ పరిధి నెహ్రూనగర్‌ కమిటీ హాల్‌లో ఉన్న జిమ్‌లు మూత పడ్డాయి. చింతల్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో జిమ్‌ పరికరాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొన్ని డివిజన్‌లలో ఉండాల్సిన వాటికన్నా తక్కువగా జిమ్‌ పరికరాలు ఉన్నాయని, స్థానికంగా ఉన్న చోటామోటా లీడర్‌లు ఆయా పరికారాలను సొంతానికి వాడుకుంటున్నట్లు తెలియవచ్చింది. 

ఇదీ పరిస్థితి...  
గాజులరామారం సర్కిల్‌ పరిధి రంగారెడ్డినగర్‌ డివిజన్‌ ఆదర్శనగర్‌ కమిటీ హాల్, కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధి సుభాష్‌నగర్‌ డివిజన్‌ అపురూప కాలనీ కమిటీ హాల్‌లో ఉన్న మోడ్రన్‌ జిమ్‌లో నెల రుసుము వసూలు చేస్తున్నారు. మోడ్రన్‌ జిమ్‌లు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచాల్సి ఉండగా ఈ రెండు జిమ్‌లలో మాత్రం నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నట్లు  తెలిసింది.  
జియాగూడ ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌ అంబేద్కర్‌ భవన్‌లో మొదటి అంతస్తులో జిమ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ప్రారంభించడంతో సామగ్రి జిమ్‌ కేంద్రంలో ఉంచుతున్నారు. వాటిలో చాలా వరకు చోరీకి గురయ్యాయని యువకులు ఆరోపిస్తున్నారు. రహీంపురాలోని జిమ్‌ను కేవలం ఉదయం వేళల్లో మాత్రమే తెరుస్తున్నారని స్థానికులు తెలిపారు.  
శాస్త్రినగర్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌లోని పరికరాలు దుమ్ముకొట్టుకుపోయాయి. గదినిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. రాంనగర్‌ డివిజన్‌ హరినగర్‌ కమ్యూనిటీ హాల్‌లో పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.  బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌ తాళం తీసే నాథుడే లేడు.   
ఉప్పల్‌ సర్కిల్‌లో నాణ్యత లేని పరికరాలు ఎక్కడికక్కడ జామ్‌ అయిపోయాయి. కొన్ని చోట్ల వంగిపోయాయి. మరికొన్ని చోట్ల సీట్లు ఊడి చెదలు పట్టాయి. బాడీ గ్రోత్‌ యంత్రం వైర్లు తెగిపడి మూలన పడ్డాయి. జిమ్‌లలో కోచ్‌లు లేకపోవడంతో చాలామంది ప్రైవేట్‌ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఉప్పల్‌ లక్ష్మారెడ్డి కాలనీలోని వార్డు కార్యాలయంలో రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన జిమ్‌కు రోజుకు ఒకరిద్దరు మాత్రమే వచ్చి పోతున్నారు.  
చిలుకానగర్‌ డివిజన్‌లో బీరప్పగడ్డలోని కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన జిమ్‌లో కనీస వసతులు లేవు. దీంట్లో ట్రేడ్‌మిల్‌ మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన యంత్రాలన్నీ మూలనపడ్డాయి. రామంతాపూర్‌ ప్రగతినగర్‌  జిమ్‌లో పరికరాలు పాడైనా మరమ్మతులు చేసేవారు లేరు.  
రామ్‌రెడ్డినగర్‌లోని జిమ్‌ గత రెండు నెలలుగా మూతపడింది. సర్కిల్‌లో వినియోగంలో ఉన్న జిమ్‌లలో రూ.300 ఫీజులు వసూలు చేస్తుండటంతో ఎవరూ ఆసక్తి చూపడం లేరు. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌ కమ్యూనిటీ హల్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌ను యువకులు, మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్ధానిక కార్పొరేటర్‌కు, కాలనీ అసోసియేషన్‌ నాయకులకు మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పటికీ జిమ్‌ను అధికారికంగా ప్రారంభించలేదు. కాలనీ అసోసియేషన్‌పై అంతస్థులోని హాల్‌లో పరికరాలుంచారు. 

మోయలేని భారం..  
జిమ్‌ల నిర్వహణను కాలనీవాసులకు వదిలేసి చేతులు దులుపుకోవడంతో అవి ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో పలుచోట్ల సౌకర్యాలు, కోచ్‌లు లేక జిమ్‌లు మూతపడగా, మరికొన్ని చోట్ల కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారంగా నడుస్తున్నాయి. కోచ్‌ జీతం, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు, స్వీపింగ్, యంత్రాల సర్వీసింగ్‌ ఖర్చులు తడిసి మోపడవుతుండడంతో ‘జిమ్‌లు మాకొద్దు బాబంటూ..’ కాలనీ సంక్షేమ సంఘాలు వాపోతున్నాయి.  
హయత్‌నగర్‌ డివిజన్‌లో శారదానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన జిమ్‌ కేంద్రానికి రోజుకు 10 మంది మాత్రమే వస్తున్నారని, వారి వద్ద వసూలు చేస్తున్న రూ.3వేలు దేనికీ సరిపోవడం లేదని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కోచ్‌ జీతం రూ.8వేలు, ఇతర ఖర్చులు కలుపుకొని నెలకు రూ.12వేల వరకు ఖర్చవుతోందని, జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి సహకారం లేదని కాలనీ కార్యదర్శి కేఎల్‌ఎన్‌రావు పేర్కొన్నారు. తమకు గుదిబండగా మారిన జిమ్‌ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని ఆయన కోరారు. బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో విజయపురి ఫేజ్‌–2కాలనీ సంక్షేమ సంఘం భవనంలోని జిమ్‌కు  కోచ్, నీటి వసతి, టాయ్‌లెట్ల సౌకర్యం లేకపోవడంతో జిమ్‌ నిరుపయోగంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top