జెరూసలెం యాత్రకు సహకారం | Jerusalem pilgrims to get help, says CM K Chandrasekhar Rao | Sakshi
Sakshi News home page

జెరూసలెం యాత్రకు సహకారం

Dec 23 2017 1:58 AM | Updated on Aug 15 2018 9:40 PM

Jerusalem pilgrims to get help, says CM K Chandrasekhar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులతో, రంజాన్‌ సమయంలో ముస్లింలతో, బోనాలు, బతుకమ్మ సందర్భంగా హిందువులతో ఉత్సవాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. క్రిస్మస్‌ పండుగ పురస్కరించుకుని శుక్రవారం నిజాం కాలేజీ మైదానంలో క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేశారు.

అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి సభికులనుద్దేశించి మాట్లాడారు. ‘‘రాజధాని నగరంలో క్రైస్తవ భవన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ భవన నిర్మాణం నా కల. వచ్చే క్రిస్మస్‌ కల్లా ఆ భవనాన్ని కచ్చితంగా నిర్మించి తీరుతాం. ఇక్కడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచిస్తున్నా. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై స్వయంగా పరిశీలిస్తా. క్రైస్తవులకు పవిత్ర స్థలమైన జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వాలని కొందరు క్రైస్తవ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు నన్ను చాలాసార్లు అడిగారు. తప్పకుండా వారి కోరిక తీరుస్తా. అతి త్వరలో ఈ పథకానికి సంబంధించిన పాలసీ ప్రకటిస్తా. చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు నా వద్ద వందకుపైగా ప్రతిపాదనలు తెచ్చారు. వాటిని పూర్తి చేయడానికి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. తప్పకుండా ఆ దరఖాస్తులను పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. అవేగాకుండా కొత్తగా వచ్చే దరఖాస్తులను సైతం వీలైనంత త్వరలో పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. గతంలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళన ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆందోళన లేదని, మూడేళ్లుగా ఎలాంటి దాడులు జరగడం లేదని చాలామంది పాస్టర్లు, బిషప్‌లు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’’అంటూ సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వికృతంగా రాజకీయాలు
రాష్ట్రంలో రాజకీయాలు వికృత రూపం దాల్చాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్ష పార్టీలంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొనడం బాధగా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులపై 196 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. క్రైస్తవ భవన్‌పైనా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. అయినా ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి వచ్చే పండుగకల్లా ప్రారంభిస్తాం. పండుగ పూట వస్త్రాలు, గిఫ్ట్‌ల పంపిణీని తక్కువగా చూడొద్దు. గిఫ్ట్‌ ప్యాక్‌లో ఉన్న కానుకను ఆర్థిక విలువతో చూడొద్దు. పేదవాడి కోణంలో చూడాలి. పండుగ పూట పేదవాడు సైతం ఆనందంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉందన్న భరోసా ఇవ్వడానికి వాటిని పంపిణీ చేస్తున్నాం’’అని అన్నారు.

 ‘‘జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు. పర్యాటక అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఆమె ఉదయమే ఫోన్‌లో మాట్లాడారు. ‘ముస్లిం ముఖ్యమంత్రినైన నేను మా రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహించలేదు. కానీ మీరు మాత్రం తెలంగాణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’అని ఆమె అన్నారు. ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల దేశమంతా ఇదే అభిప్రాయం ఉండాలని కోరుకున్నా’’అని సీఎం వివరించారు. రాష్ట్రంలోని 70 శాతం ప్రజలకు తాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని, ఈ సాయంత్రమే సమాచారం వచ్చిందని తెలిపారు. త్వరలో హరిత తెలంగాణను చూడనున్నారని, రాష్ట్ర ప్రజల కల సాకారం కానుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశిష్ట సేవలందించిన క్రైస్తవులు, సంస్థలకు సీఎం అవార్డులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement