
బస్టాప్‌లోని ప్రయాణికులపై పాలస్తీనియన్ల కాల్పులు
ఆరుగురి మృతి 12 మందికి గాయాలు
జవాన్లు, పౌరుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు సాయుధుల హతం
జెరూసలెం: పాలస్తీనియన్లు ఉండే గాజాలో ఇజ్రాయెల్ బలగాలు భీకరదాడులు చేస్తుంటే అందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో పాలస్తీనియన్లు కాల్పుల మోత మోగించారు. ఇద్దరు సాయుధ పాలస్తీనియన్లు సోమవారం జెరూసలెం శివారు రమోత్ జంక్షన్ వద్ద జరిపిన కాల్పుల ఘటనలో ఆరుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఉదయం పనివేళల వేళ రద్దీగా ఉన్న బస్టాప్‌లో ఈ కాల్పుల ఉదంతం చోటుచేసుకుందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.
కాల్పులు జరిపింది తామేనని ఎలాంటి సాయుధ సంస్థ ప్రకటించలేదు. కానీ కాల్పుల ఘటనను కీర్తిస్తూ గాజాలోని సాయుధ హమాస్ సంస్థ తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘మా ప్రజల భూభాగాలను అన్యాయంగా అక్రమించుకున్న నేరాలకు శిక్షగా జరిగిన సహజ ఘటన ఇది’’అని ఆ పోస్ట్‌లో పేర్కొంది. జెరూసలెంలో ఇటీవలకాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుని తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన ఘటన జరగడం ఇదే తొలిసారి. జెరూసలెం ఘటనపై పలు దేశాల అగ్రనేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అమాయక ప్రజలపై అమానుష దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు.
వాహనంలో వచ్చి, విచక్షణారహితంగా కాల్చి..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జెరూసలెంకు ఉత్తరాన ఉన్న రమోత్ జంక్షన్‌లోని బస్టాప్.. ఆఫీస్ పనివేళలు కావడంతో ఉదయం ఆ ఉద్యోగాలు, పనులకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉంది. అదే సమయానికి ఇద్దరు సాయుధులు వాహనంలో బస్టాప్‌కు వచ్చారు. వెంటనే గన్‌లు తీసి బస్టాప్‌లోని ప్రయాణికులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. హఠాత్తుగా వచ్చిపడుతున్న తుపాకీ గుళ్ల ధాటికి జనం ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరుగులుతీశారు. తుపాకీ గుళ్లు తగిలి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అక్కడ ఆగి ఉన్న బస్సు ముందు అద్దం తుపాకీ గుళ్ల ధాటికి చిల్లులతో చిధ్రమైంది.
డ్యూటీలోలేని ఒక జవాను, కొందరు పౌరులు తమ వద్ద ఉన్న గన్‌లతో సాయుధులపైకి తెగించి ప్రతిదాడిచేశారు. ఈ ప్రతిదాడిలో సాయుధులు ఇద్దరూ హతమయ్యారు. జనం పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఒక్కసారిగా బుల్లెట్ల మోత మొదలైంది. ఏం జరుగుతుందో తెల్సుకునేలోపే జనం అటూఇటూ పరుగులు పెడుతున్నారు. కచ్చితంగా చచ్చిపోతాననుకున్నా. బుల్లెట్‌గాయంతో బయటపడ్డా’’అని ప్రత్యక్ష సాక్షి ఈస్టర్ లుగాసీ చెప్పారు. ‘‘ఇది జుడాయిజం, ఇస్లామ్‌కు మధ్య సంఘర్షణ కాదు.
హాని చేయాలనుకునే వాళ్లకు, స్వేచ్ఛగా బతకాలనే వాళ్లకు మధ్య యుద్ధం’’అని యునైటెడ్ హాజాలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ వలంటీర్ డేనియల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చనిపోయిన ఆరుగురిని యాకోవ్ పింటో(25), ఇజ్రాయెల్ మాజ్నెర్(28), రబ్బీ యూసెఫ్ డేవిడ్(43), మొర్దెచాయ్ మార్క్ స్టెన్సాంగ్ (79), లెవీ ఇజాక్ పాష్, సారా మెండెల్సన్(60)లుగా గుర్తించారు. కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ స్పందించారు. ‘‘అమాయక చిన్నారులు, పౌరులు, వృద్దులను పొట్టనబెట్టుకున్నారు. దాడి సూత్రధారులను అంతంచేస్తాం’’అని ఆయన ప్రతిజ్ఞచేశారు. ఘటనాస్థలిని తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ల నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు అధికమైందని ఆయన వ్యాఖ్యానించారు.