అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్‌–2

JBS To MGBS Metro Rail Ready Available - Sakshi

జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ ట్రయల్స్‌ ప్రారంభం

త్వరలో ప్రయాణికులకు అవకాశం

11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు  

సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్, హైదరాబాద్‌ మధ్య మెట్రో బంధం వేయనుంది. పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్‌–ఫలక్‌నుమా కారిడార్‌ నిలిచిపోనుంది. ఈ మెట్రో–2 కారిడార్‌లో భాగంగా జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ వరకు సోమవారం ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి నేతృత్వంలో సాంకేతిక బృందం, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.నాయుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఏకే సాయిని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కారిడార్‌లో సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ రెండింటి మధ్య    
11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి.

జేబీఎస్‌–పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే ఈ రూట్‌లో రోడ్డు మార్గంలో  45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్‌ వ్యవస్థ పనితీరు, బ్రేక్‌ టెస్ట్, ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టమ్, ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్‌మెంట్‌ తదితర అంశాలను పరిశీలిస్తారు.  

ప్రయాణికులకు ఊరట...   
కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో  నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు  వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది.  
 
కోఠీకి కొత్త కళ... 
నిజాం కాలం నుంచి అతిపెద్ద వ్యాపార, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న అబిడ్స్, కోఠీ, సుల్తాన్‌బజార్‌  ప్రాంతాలు మెట్రోరైలు రాకతో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి  ప్రజలు మెట్రో రైలులో సుల్తాన్‌బజార్‌కు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో సిటీ బస్సులు మాత్రమే  ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి కోఠీ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్‌లో నడిచే సిటీ బస్సులపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ రూట్‌లో సిటీ బస్సులు ఆదరణ కోల్పోయాయి. నాగోల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా అమీర్‌పేట్‌ వరకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ రెండు ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ ఏసీ బస్సులను చాలా వరకు తగ్గించింది.

తాజాగా జేబీఎస్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఎంజీబీఎస్‌ వరకు కొత్త లైన్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. మరోవైపు హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.05 కిలోమీటర్ల  మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ఈ నెల 29న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ మార్గాల్లో 3.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికులకు మెట్రో సదుపాయం అందుబాటులోకి వస్తే మరో 2లక్షల మందికి పైగా అదనంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top