కారాగారంలో..కర్మాగారం | Jail Officers Creating Employment Opportunities In Mahabubnagar | Sakshi
Sakshi News home page

కారాగారంలో..కర్మాగారం

Oct 20 2019 9:19 AM | Updated on Oct 20 2019 9:20 AM

Jail Officers Creating Employment Opportunities In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: ఇది వరకు జైల్లో ఉండే ఖైదీలంటే రాళ్లు కొట్టడం.. వడ్రంగి పనులు చేయడం.. మహిళా ఖైదీలైతే అల్లికలు, చేతికుట్లు కుట్టడం లాంటి పనులు చేసేవారు.. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా పెట్రోల్‌ పంపుల్లో బాయ్‌లుగా.. పరిశ్రమల్లో బెంచీలు, బీరువాలు, పాఠశాల డెస్కులు.. ఇళ్లలో వాడే ఫినాయిల్‌ తయారు చేస్తూ పనిమంతులుగా.. రుచికరమైన అల్పాహారం తయారు చేస్తూ మంచి వంట మాస్టర్లుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు.. మహబూబ్‌నగర్‌ జిల్లా జైలులో పలువురు ఖైదీలు.. ఈ పరిణామం వారిలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు తీసుకువస్తోంది. దీని వెనక జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సంస్కరణాభిలాష ఉంది.

ఆదాయానికి మైలేజీ.. 
మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో 2016లో జిల్లా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు కారాగారానికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇది జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటైన మొదటి పెట్రోల్‌ బంక్‌. ప్రస్తుతం రోజుకు రూ.7–8 లక్షల అమ్మకాలు జరుగుతుండగా దీని ద్వారా నెలకు రూ.15 లక్షల ఆదాయం సమకూరుతోంది. 2016 జూన్‌ నుంచి 2018 వరకు రూ. 1.44 కోట్ల ఆదాయం పెట్రోల్‌ బంకు ద్వారా వచ్చింది.

ప్రస్తుతం 20 మంది ఖైదీలు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ లభించే ఇంధనం కల్తీ కాకపోవడం, మైలే జీ ఇవ్వడంతో వినియోగదారులు అధికంగా ఈ బంక్‌ను ఆ శ్రయిస్తున్నారు. ఈ బంకు రాకతో కారాగార ఏడాది టర్నోవర్‌ బాగా పెరగడంతో జిల్లాలో మరో 10 పెట్రోల్‌ బంకు లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది.

వినూత్న తరహాలో..
తీవ్ర నేరాల కేసుల్లో శిక్షపడి జైలులో ఉండే వారు కుటుంబాల గురించి ఆలోచిస్తూ.. కుంగిపోయి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఒక పని నేర్పించి ఖర్చులకు సొంతంగా కొంత డబ్బు సంపాదించేలా జైళ్ల శాఖ తోడ్పాటునందిస్తోంది. ఇలా చేయడం వల్ల వారి మానసిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందనేది ఆలోచన. ఈ క్రమంలో రిమాండ్‌ ఖైదీల నుంచి శిక్ష అనుభిస్తున్న ఖైదీల వరకు వారిలో నిబిడీకృతమైన సామర్థ్యాన్ని జైలు అధికారులు వెలికితీస్తున్నారు.

వినూత్న తరహాలో మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్నారు. దశాబ్దం కిందటి నుంచి ఓపెన్‌ ఎయిర్‌ ఖైదీలతో జిల్లా కారాగారంలో వ్యవసాయ క్షేత్రాలు, చిన్నతరహా పరిశ్రమ ఉత్పత్తుల్లో ఖైదీల భాగస్వామ్యం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. అదే విధానాన్ని కంప్యూటర్‌ వినియోగంలో శిక్షణ వంటి ఆధునిక పద్ధతుల్లోనూ వినియోగిస్తున్నారు.

రూ.5కే నాలుగు ఇడ్లీలు..
జిల్లా జైలు ఆధ్వర్యంలో ఈ నెల 15న రూ.5కే నాలుగు ఇడ్లీలు అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5తో ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కనీసం తాగడానికి చాయి కూడా రాదు. అలాంటిది జిల్లా జైలు అధికారులు వినూత్నంగా ఆలోచించి రూ.5కే నాలుగు ఇడ్లీలు అని చెప్పడంతో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇడ్లీలు తయారు చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇడ్లీలను విక్రయిస్తున్నారు.

ప్రతిరోజు ఇడ్లీల ద్వారా రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తోంది. తక్కువ ధర కావడంతో చుట్టు పక్కల వారితోపాటు ప్రధాన రోడ్డు వెంట ప్రయాణం చేసే వారు సైతం రుచి కోసం ఇడ్లీలు కొనుగోలు చేసి తింటున్నారు. దీంతో ఇడ్లీ కేంద్రానికి మంచి డిమాండ్‌ ఏర్పడింది.

శిక్షణతో కూడిన ఉపాధి
జైలులో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఎక్కువ కాలం శిక్ష ఉన్న వారిని గుర్తించి అలాంటి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా రు. ప్రస్తుతం జిల్లా జై లులో నోట్‌ పుస్తకాల యూనిట్‌తోపాటు ఫినా యిలో యూనిట్, స్టీల్‌ ఫ్యాక్టరీ, ఇడ్లీ కేంద్రం, గోధుమ పిండి తయారీ కేంద్రం, పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాదిలో బేకరీ, ఆయుర్వేద విలేజ్‌ యూనిట్‌ను ప్రారంభించడానికి కృషిచేస్తున్నారు.

ఇప్పటి వరకు జిల్లా జైలులో 190 మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. వీరంతా గత నాలుగేళ్లలో ఫినాయిల్‌ అమ్మకాలకు రూ.2 లక్షలు ఫర్నీచర్‌ ద్వారా రూ.50 లక్షలు, గోధుమ పిండి ద్వారా రూ.1.77 లక్షలు, నోట్‌ పుస్తకాల కోసం రూ.38 లక్షలతో  ఆర్డర్లు స్వీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement