డీఈఈ.. లంచావతారం

Irrigation Department DEE Arrest For Taking Bribe In Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌) : పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖలో డీఈఈగా విధులు నిర్వర్తిస్తున్న రవికాంత్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలో చెరువుల్లో మట్టి తరలింపు వ్యవహారంపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్‌ శ్రీదేవసేన స్థానిక ఇరిగేషన్‌ శాఖ ఈఈ రవికుమార్‌ను 15రోజలు క్రితమే ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

ఆయన స్థానంలో వచ్చిన రవికాంత్‌ రెండు వారాలకే చేతివాటం ప్రదర్శించాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిప కాంట్రాక్టర్‌ కావటి రాజు ఇటీవల మిషన్‌కాకతీయలో రూ.కోటి పనులు చేశాడు. రెండేళ్ల కాలంలో రూ.60 లక్షల మేరకు బిల్లులు తీసుకున్న రాజుకు ఇరిగేషన్‌శాఖ నుంచి మరో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వీటికోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరగగా ఇరిగేషన్‌ డీఈఈ రవికాంత్‌ రూ.లక్ష డిమాండ్‌ చేయడంతో చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. 

పథకం ప్రకారం రూ.లక్ష ఏకకాలంలో చెల్లిస్తే సదరు అధికారికి అనుమానం కలుగుతుందని రాజు తనవద్ద రూ.80 వేలు ఉన్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం అధికారి వద్దకు వెళ్లాడు. అయితే బిల్లు చెల్లింపునకు ఒకే చెప్పిన డీఈఈ రవికాంత్‌ తన సొంత డ్రైవర్‌ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సైగా చేశాడు. దీంతో బాధితుడు డ్రైవర్‌ రాజుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని డీఈఈ రవికాంత్‌తో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈసందర్భంగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ ఈనెల 8న కాంట్రాక్టర్‌ రాజు తమకు ఫిర్యాదు చేశాడని, విచారణ పూర్తిచేసి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిఘా ఏర్పాటు చేసి రవికాంత్‌ను పట్టుకున్నామన్నారు.  నిందితులను ఏసీబీ కోర్టులో  శనివారం  హాజరుపరుస్తామని పేర్కొన్నారు. దాడిలో సీఐలు సంజీవ్, వేణుగోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు. 

నరకం చూశాకే ఏసీబీని కలిశా..
కొన్నేళ్లుగా కాంట్రాక్టరుగా పనిచేస్తున్నా. నా పేరు, నా భార్య పేరుతో నిబంధనల మేరకు కాంట్రాక్టు పనులు పూర్తి చేశా. అయినా బిల్లు చెల్లించడానికి అధికారులు నానా రకాలుగా బాధలకు గురిచేశారు. బిల్లు కోసం తిరిగితిరిగి నరకం చూశా. ఇచ్చిన కాడికి తీసుకుంటే ఎవరికీ బాధ ఉండేది కాదు. డిమాండ్‌ చేయడం వల్లే విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించా. 
– కావటి రాజు, ఓదెల మండలం 

డ్రైవర్‌ రాజు, పక్కన డీఈఈ రవికాంత్‌
సీఐలతో మాట్లాడుతున్న డీఎస్పీ భద్రయ్య 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top