రూ.3.3 కోట్ల వ్యవహారంలో లోతుగా దర్యాప్తు | Investigating deeply into the affair of Rs.3 crore above case | Sakshi
Sakshi News home page

రూ.3.3 కోట్ల వ్యవహారంలో లోతుగా దర్యాప్తు

Apr 6 2019 2:30 AM | Updated on Apr 6 2019 2:30 AM

Investigating deeply into the affair of Rs.3 crore above case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నగర వ్యాప్తంగా నగదు తరలింపుపై నిఘా పెట్టి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఓ సమాచారం ఆధారంగా గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు రూ.3,30,84,500 నగదు స్వాధీనం చేసుకోగలిగారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు అప్పగించామని ఆయన శుక్రవారం తెలిపారు.

వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావులతో కలసి తన కార్యాలయంలో అంజనీకుమార్‌ విలేకరులతో మాట్లాడారు. గురువారం ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వేగంగా స్పందించిన బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తనిఖీలు చేయడానికి ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు నేతృత్వంలోని బృందం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రోడ్‌ నం.10లో ఉన్న జహీరానగర్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో వస్తున్న చంద్రకాంత్‌ అనే వ్యక్తి నుంచి రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సూత్రధారులకు తెలియకుండా ఉండేందుకు అతడి నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా విచారించారు.

అలా అతడిచ్చిన సమాచారంతో అబిడ్స్‌లోని జవేరి జ్యూయలర్స్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ వద్దకు వెళ్లిన అధికారులు అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేట ప్రాంతంలో దాడి చేసి ప్రసాద్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుంచి రూ.30.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్, అమీర్‌పేట్, రామాంతపూర్, బషీర్‌బాగ్, బేగంపేట తదితర ప్రాంతాలకు చెందిన చంద్రకాంత్, అనిల్‌కుమార్, ప్రకాష్, సంతోష్‌కుమార్, విక్కీ సింగ్, వి.నరేష్‌బాబు, పోబిష్‌ గగోయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు గతంలో హవాలా వ్యాపారం చేసిన వాళ్లు, మరికొందరు వ్యాపారులు ఉన్నారు.

ఈ నగదు సరఫరాకు ఎన్నికలకు ఏదైనా లింకు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కేసును నగదుతో సహా ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. ఆపై లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగా ఈ కరెన్సీ నోట్ల నంబర్ల ఆధారంగా అవి ఏ బ్యాంకు శాఖ నుంచి, ఏ ఖాతా నుంచి డ్రా అయ్యాయి? ఎవరు చేశారు? అనేవి గుర్తించనున్నారు. ఈ వివరాలు ఆధారంగా వారికి నోటీసులు జారీ చేసి విచారించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ నగదు అక్రమ లావాదేవీల నేపథ్యంలో ఆడి, పోలో కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement