జంబ్లింగ్‌ లేకుండానే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌! 

Intermediate Board Has Decided Practical Exam Should Conduct Without Jumbling Of Centers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈసారి కూడా సెంటర్ల జంబ్లింగ్‌ లేకుండానే నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శిగా సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఇటీవలే రావడం, విద్యా శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కూడా కొత్తవారే కావడంతో ప్రాక్టికల్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జంబ్లింగ్‌ అమలుకు మొదట్లో ఆలోచనలు చేసినా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న భావనలో బోర్డు వర్గాలు ఉన్నాయి.

అందుకే 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించే ప్రాక్టికల్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం అమలు సాధ్యం కాదని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్‌ సాధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలోనే జంబ్లింగ్‌ విధానాన్ని అమలుచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నా
రాష్ట్రంలో 2,500 వరకు జూనియర్‌ కాలేజీలు ఉండగా, వాటిల్లో దాదాపు 10 లక్షల మంది చదువుతున్నారు. అందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉండగా, అందులో సైన్స్‌ కోర్సుల విద్యార్థులు 3 లక్షలకు పైగా ఉంటున్నారు. వారికి ప్రతి ఏటా సొంత కాలేజీల్లోనే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ కారణంగా కార్పొరేట్‌ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్‌ చేసి, తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30 మార్కులకు 30 మార్కులు వేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఎప్పటి నుంచో ప్రాక్టికల్‌ పరీక్షల కేంద్రాల ఏర్పాటులోనూ జంబ్లింగ్‌ విధానం అమలు చేయాలన్న డిమాండ్‌ ఉంది. అయితే ప్రతి ఏటా బోర్డు అధికారులు మొదట్లో జంబ్లింగ్‌ అమలు చేస్తామని ప్రకటించడం, ఆ తరువాత ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో జంబ్లింగ్‌ లేకుండానే ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించడం కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్‌ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులను వేయించుకుంటున్నందున ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది.

ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30కి 30 మార్కులను వేయడం లేదు. దీంతో వారు నష్టపోతున్నారు. అయితే ఈసారి ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌ అమలుకు చర్యలు చేపడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల పేర్కొన్నారు. కానీ ప్రాక్టికల్‌ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్‌ సా«ధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయి. పైగా బోర్డు కార్యదర్శిగా సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ కొత్తగా వచ్చినందునా, ఇప్పుడు ఆయన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపైనే దృష్టి పెట్టారు. గతేడాది దొర్లిన పొరపాట్లు దొర్లకుండా హాల్‌టికెట్ల జనరేషన్‌ నుంచి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపైనే ప్రత్యేక దృష్టి సారించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top